న్యాయ వ్యవస్ధ భారతీయకరణం కావాలి:సిజెఐ

  • ప్రతిబింబించేలా కోర్టుల్లో మార్పు రావాలి
  • పిటిషనర్‌ కేంద్రంగా వ్యవస్థ పని చేయాలి
  • వలసవాద నియమాలను మార్చాలి
  • భారత సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ

బెంగళూరు: భారత న్యాయవ్యవస్థను సాధ్యమైనంత త్వరగా దేశ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్చాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్‌ రమణ అన్నారు.

ప్రస్తుత న్యాయవ్యవస్థ, నిబంధనలు, కోర్టుల్లో విచారణ విధానంలో బ్రిటన్‌ మూలాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఉన్న వైవిధ్యానికి ఈ తరహా వ్యవస్థలు సరిపోవన్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన ‘పిటిషనర్‌ కేంద్రంగా’నే కోర్టులు పనిచేయాలని నొక్కి చెప్పారు. ఏప్రిల్‌ 25న కన్నుమూసిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ ఎంఎం శంతనగౌడర్‌ సంస్మరణ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ మాట్లాడారు.

సామాన్య మానవుడు కోర్టును ఆశ్రయించినప్పుడు జడ్జిలను, కోర్టు వ్యవహారాలను చూసి భయపడే పరిస్థితులు ఉండరాదన్నారు. ‘రెండు కుటుంబాల తగాదా కోర్టుకు చేరితే.. వాదనలు, తీర్పులు ఇంగ్లిష్‌లో ఉంటాయి. అవి పిటిషినర్‌కు అర్థం కావు.

అందుకే స్థానిక పరిస్థితులను బట్టి వాదనలు, తీర్పులు ఉండాలి’ అని పేర్కొన్నారు. కక్షిదారు నిజం చెప్పగలిగేలా కోర్టుల్లో వాతావరణాన్ని సౌకర్యవంతంగా మార్చాల్సిన బాధ్యత జడ్జిలు, లాయర్లదేనన్నారు. సామాన్యులు న్యాయాన్ని వేగంగా పొందడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా న్యాయవ్యవస్థ వనరులను ఆదా చేయవచ్చని, కోర్టుల్లో పెండింగ్‌ కేసులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు.

శంతనగౌడర్‌ ‘అసాధారణ జడ్జి’ అని జస్టిస్‌ రమణ గుర్తుచేసుకొన్నారు. ఆయన ‘సామాన్యుల జడ్జి’ అని, దేశం ఆయన సేవలను కోల్పోయిందని పేర్కొన్నారు. శంతనగౌడర్‌ 1958 మే 5న కర్ణాటకలో జన్మించారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2023 మే 5 వరకు ఆయన పదవిలో కొనసాగాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.