జగన్ బాబూ !ఏవీ నాటి రాజధానిపై నీమాటలు ,నీటిపై రాతలేనా?

మాట తప్పం-మడమ తిప్పం అనేది వైఎస్ కుటుంబం తరచుగా వాడే ట్యాగ్ లైన్. జగన్ ఎన్నికలకు తాడేపల్లిలో తన కలల సౌధం నిర్మించుకున్నారు. ఇంటి ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఆ గృహప్రవేశానికి వచ్చిన రోజా , ఆళ్ళ రామకృష్ణారెడ్డి వంటివాళ్ళు మా జగన్ సొంత ఇల్లు కట్టుకున్నారు. మరి చంద్రబాబు మాత్రం ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. మాజగన్ బాబు చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అన్నారు. అధికారం చేపట్టిన ఆరు నెలలకే ఒక రాజధాని ని మూడు రాజధానులు చేస్తున్నాం అన్న పిడుగులాంటి ప్రకటన చేశారు. నేటితో రాజధానిపై జగన్‌ మాటలకు ఏడేళ్లు పూర్తి అయ్యాయి. నాడేమో సంపూర్ణ మద్దతు.. నేడు అంతా రివర్స్‌.

‘అధ్యక్షా.. విజయవాడలో కేపిటల్‌ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేం ఆహ్వానిస్తున్నాం. కేపిటల్‌ సిటీ ఎక్కడన్నా పెట్టండి.. కానీ కనీసం 30 వేల ఎకరాలున్న చోట పెట్టండని మేం మొదటి నుంచీ చెబుతున్నాం ..’

ఇది 2014 సెప్టెంబరులో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన

‘ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశం మాకు లేదు. అందుకే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు మనస్ఫూర్తిగా జగన్‌ ఆహ్వానిస్తున్నారు’

..అసెంబ్లీ ప్రకటన రోజునే ట్విటర్‌లో వైసీపీ

ఇది జరిగి సరిగ్గా ఏడేళ్లయింది. మరి మనస్ఫూర్తిగానే అమరావతిని ఆహ్వానించిన జగన్‌.. దాని అభివృద్ధికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? 3 రాజధానుల నిర్ణయం ప్రాంతీయ చిచ్చు పెట్టకుండా ఉండేందుకేనా? గద్దెనెక్కగానే అమరావతి ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆపేశారు? భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించకుండా.. మౌలిక వసతులు కల్పించకుండా ఎందుకు అలక్ష్యం చేస్తున్నారు…? నాటి మాటలకు.. నేటి చేతలకు పొంతన లేకపోవడంపై రాజకీయ వర్గాలు, అమరావతి కోసం ఉద్యమిస్తున్నవారు సంధిస్తున్న ప్రశ్నలివి.

విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతించిన జగన్మోహన్‌రెడ్డి.. సీఎంగా పగ్గాలు చేపట్టి 27 నెలలైంది. కానీ రాజధాని విషయంలో అంతా రివర్స్‌ అయిపోయింది. ఎన్నికలకు ముందు తాడేపల్లిలో గృహప్రవేశం చేసి.. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానని చెప్పకనే చెప్పిన ఆయన.. గద్దెనెక్కగానే అమరావతి ప్రాజెక్టులన్నీ ఆపేశారు. దాని అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కావాలన్నారు. ఒకే చోట అంత పెట్టుబడి పెడితే మిగతా రాష్ట్రం ఏం కావాలని ప్రశ్నించారు. అమరావతి ఒక సామాజిక వర్గానికే రాజధాని అని అన్నారు. ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ దానిని శ్మశానమన్నారు.. ఇంకొకరు ఏకంగా ఎడారితో పోల్చారు. వారిని చూసి పలువురు మంత్రులు, వైసీపీ నేతల నోట ఎన్నెన్నో వ్యాఖ్యలు. సందట్లో సడేమియాలాగా.. 2019 డిసెంబరు 17న సీఎం జగన్‌ మూడు రాజధానుల బాంబుతో సంచలనం సృష్టించారు. వేశామన్న కమిటీల నివేదికలు రాకముందే ప్రకటించేశారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని.. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును, రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) రద్దు బిల్లును శాసనసభలో ఆమోదింపజేసుకున్నారు. గవర్నర్‌ కూడా ఆమోదముద్ర వేశారు. హైకోర్టు అడ్డుకోవడం వేరే విషయం. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏదని అడిగితే ఏదో చెప్పలేని పరిస్థితి. చివరకు కేంద్రం కూడా చెప్పడం లేదు. కాసేపు హైదరాబాద్‌ అని, కాసేపు వైజాగ్‌ అని కేంద్ర అధికారులు ఆటలాడుతున్నారు.

ఎవరైనా నిలదీస్తే పొరపాటు జరిగిందంటూ సరిదిద్దుతున్నారు. అమరావతి భూముల సమీకరణలో అక్రమాలు జరిగాయని.. ఇదో పెద్ద భూకుంభకోణమని.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రతిపక్షంలో ఉండగానే జగన్‌ ఆరోపణలు మొదలుపెట్టారు. దీంతో ఆయన అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని, రాజధానిని మార్చబోమని జగన్‌ ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ వచ్చీ రాకముందే అమరావతి అభివృద్ధిని నిలిపివేసి.. మూడు రాజధానుల పేరిట ప్రాంతీయ చిచ్చు పెట్టారని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో మొదలైన రాజధాని భవన నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆపేసి.. వాటిని పాడుపెట్టేయడం.. రోడ్లు తవ్వేయడం.. వైజాగ్‌కు కార్యాలయాలను తరలించాలని చూడడం.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ విశాఖలో ప్రత్యేక గెస్ట్‌హౌస్‌ నిర్మాణం సాగించడం.. ఇవన్నీ ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోయడం కాదా అని నిలదీస్తున్నాయి. 13 జిల్లాల చిన్నరాష్ట్రంలో ఒక ప్రాంతానికీ.. ఇంకొక ప్రాంతానికీ మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పి.. జగన్‌ ఇప్పుడు చేస్తున్నదేమిటని ధ్వజమెత్తుతున్నాయి. ఇది మాట తప్పడం.. మడమ తిప్పడం కాదా అని నిలదీస్తున్నాయి. మాటిచ్చాడంటే.. చేస్తాడంతే అనే ట్యాగ్‌లైన్‌తో ప్రకటనలు ఇవ్వడం కాదని .. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని రాజధాని రైతులు, మహిళలు కోరుతున్నారు.

ఏవీ 30 వేల ఎకరాలు?

కనీసం 30 వేల ఎకరాలు ఉన్న చోట కేపిటల్‌ సిటీ పెట్టాలని జగన్‌ ప్రతిపక్ష నేతగా 2014 సెప్టెంబరు 4న అసెంబ్లీలో చెప్పారు. ఎందుకు ఇన్ని ఎకరాలు కావాలో కారణాలు కూడా చెప్పారు. మొత్తం 30 వేల ఎకరాలు గవర్నమెంటుదే ఉంటే.. భూమి రేటు ఎంతో ప్రభుత్వమే ఖరారుచేసే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా ఉద్యోగానికి అక్కడకు వెళ్లినా.. సామాన్యులెవరైనా.. ఈఎంఐ పద్ధతిలో ఫ్లాటు కొనుక్కోవాలన్నా.. అందుబాటు రేటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ మాట చెప్పామన్నారు.

ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో మనమంతట మనమే రియల్‌ ఎస్టేట్‌ ప్రోత్సహిస్తున్నాం. నయా జమీందార్లను ప్రోత్సహించే పరిస్థితుల్లోకి తీసుకుని పోతున్నాం అని చెప్పారు. కరెక్టయిన పద్ధతి కాకపోయినప్పటికీ రాష్ట్రం ఒక్కటిగా ఉండాలి.. రాష్ట్రంలో భావోద్వేగాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో.. చంద్రబాబు చేసిన పద్ధతి తమకు నచ్చకపోయినా.. అసెంబ్లీలో చర్చలో పాల్గొంటున్నామని… నిర్మాణాత్మక సలహాలు ఇస్తున్నామని జగన్‌ వ్యాఖ్యానించారు. భూసమీకరణ చేయనీ.. సేకరణ చేయనీ.. అమరావతిలో ప్రభుత్వం వద్ద 30 వేల ఎకరాలు ఉన్నాయా లేవా? మరి పరిపాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం చెబుతున్న విశాఖపట్నంలో ఒకే చోట 30 వేల ఎకరాలు సేకరించారా? ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడ్డాయా? అలా ఎన్ని ఎకరాలు సేకరించారు? ప్రభుత్వ పెద్దలు గానీ, అధికారులు గానీ సమాధానమివ్వడం లేదు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చినా.. పదే పదే ఆరోపణలు చేయడంలోని ఉద్దేశమేమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వానికి సమస్యలు ఎదురైనప్పుడల్లా.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే పరిపాలనారాజధాని విశాఖను వాడుకుంటోందని ఎద్దేవాచేస్తున్నాయి. ఆరునూరైనా రాజధాని విశాఖకు తరలకుండా అడ్డుకోలేరని మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని.. అది పులివెందులైనా.. వైజాగైనా అని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. తదితరులు చేస్తున్న ప్రకటనలు ఈ కోవలోవేనని పేర్కొంటున్నాయి. అమరావతిలో భూకుంభకోణం జరిగిందంటున్న ప్రభుత్వ పెద్దలు.. విశాఖలో జరుగుతున్న భూకబ్జాలు, లావాదేవీలపై నోరు మెదపడం లేదని విమర్శిస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, అమరావతి సౌజన్యంతో కొంత భాగం)

 

Leave A Reply

Your email address will not be published.