‘ఒడా’ పరధిలో 618 అక్రమ లేఅవుట్లు!

618 Lay outs barred by ongole develop

 

ఒడా పరిధిలో 618 వరకు గుర్తించి నిషేధం

అమ్మకాలకు సిద్ధంచేసిన ఓ లేఅవుట్‌

ఒంగోలు జిల్లాలోని ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో అనుమతి లేని లేఅవుట్లలో క్రయవిక్రయాలకు బ్రేకు పడింది.

వీటిలోని స్థలాలకు సంబంధించి లావాదేవీలు నిర్వహించకూడదని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు టౌన్‌-కంట్రీ ప్లానింగ్‌ విభాగం సంచాలకుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఒడా పరిధిలో ఇటువంటివి 618 లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. అనేకచోట్ల పంచాయతీల పరిధిలో, మండల కేంద్రానికి ఆనుకొని, పురపాలకాల్లోనూ స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారీతిన వెంచర్లు వేశారు. నిబంధనల ప్రకారం 40 అడుగుల రోడ్లు, సామాజిక అవసరాల కోసం స్థలాలు విడిచిపెట్టడం వంటివి చేయాలి. చాలాచోట్ల పాటించలేదు. భవిష్యత్తులో ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కొనుగోలుదారులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అడ్వాన్సులు ఇచ్చినవారు కూడా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఒంగోలు పట్టణం, ఒంగోలు గ్రామీణంతో పాటు పలుచోట్ల నిషేధిత ప్లాట్లు ఉన్నాయి. ఒంగోలు పట్టణంలో సుమారు 37 డివిజన్లతో పాటు, అత్యధికంగా కొప్పోలు, మామిడిపాలెం, మంగమూరు డొంక, పేర్నమెట్ట తదితర ప్రాంతాల్లో క్రయవిక్రయాలపై ప్రతిష్టంభన ఏర్పడింది.
తొలగేదెప్పుడు..
నిషేధాన్ని తొలగిస్తే తప్ప మళ్లీ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ తాత్కాలిక నిషేధమన్నది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లే అవుట్‌ వేసినప్పుడే కన్వర్షన్‌ ఫీజులు వంటివి కట్టించుకొని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నామని మరికొందరు చెబుతున్నారు. ఇటువంటి లేఅవుట్ల విషయంలో నిర్ణీత మొత్తం కట్టించుకొని క్రమబద్ధీకరించే యోచన సైతం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో నెలకు రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల వరకూ రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదాయం లభిస్తుంది.. ప్రస్తుతం దాదాపు 40 శాతం ఆదాయం తగ్గిపోనుంది. ఇక అక్రమ లేఅవుట్లు ఎవరు వేస్తున్నారు? ఎలా వేస్తున్నారనేది అనేకమందికి అంతుబట్టని విషయం.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల వద్ద వ్యాపారి ఒప్పందం కుదుర్చుకొని మట్టి దారులు నిర్మించి, స్థలాల హద్దులకు రాళ్లు ఏర్పాటుచేస్తుంటారు. ఆ స్థలం చూపించి క్రయవిక్రయాలు చేసుకుంటారు.. రైతు నేరుగా ఆ ఒక్క ప్లాట్‌ వరకూ రిజిస్ట్రేషన్‌ చేస్తారు. కన్వర్షన్‌ ఫీజులు, లింకు పత్రాలు ఉంటాయి.. లే అవుట్‌కు అనుమతి మాత్రం ఉండదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆ శాఖ అధికారులు కూడా చూడడం లేదు. ఒకే స్థలం అనేక సార్లు క్రయ విక్రయాలు జరుగుతున్న సందర్భాలు అనేకం. లే అవుట్ల్లను క్రమబద్దీకరిస్తారా? కొన్న ప్లాట్లనా? వంటి సందేహాలు అనేకమందిని వెన్నాడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.