హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు ఇక పండగల సీజన్ తర్వాతే!

  • హుజూరాబాద్, బద్వేల్ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు 
  • కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం  
  • ఏపీ, తెలంగాణ విజ్ఞప్తి మేర పండగల తర్వాతే ఎన్నికలు  

హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో గెలుపొంది తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై తిరుగులేని ఆధిపత్యం సాధించాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఈ హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణతో పాటు ఏపీలోని బద్వేల్ ఉపఎన్నికపై కూడా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా మహమ్మారి, పండగల సీజన్ వల్ల తమ తమ రాష్ట్రాలలో ఉప ఎన్నికలను పండగ సీజన్ ముగిసిన తర్వాతనే నిర్వహించాలంటూ ఈ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారనీ, దీంతో ఈ ఉప ఎన్నికలను పండగల సీజన్ అనంతరమే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.

అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి మేర ఆమె పోటీ చేస్తున్న బెంగాల్ లోని భవానీ పూర్ నియోజక వర్గంతో పాటు షంషేర్ గంజ్, జాంగీపూర్, అలాగే ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇక మిగిలిన 31 నియోజకవర్గాల ఉపఎన్నికలను పండగల సీజన్ తర్వాతనే నిర్వహించడం జరుగుతుందని ఈసీ ప్రకటించింది. వీటితో పాటు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు జరగాల్సిన ఉపఎన్నికలను కూడా ఇప్పుడు నిర్వహించడం లేదని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.