విశాఖలో మసకబారిన వైసిపి ప్రభుత్వ ప్రతిష్ట

విశాఖలో మసకబారిన వైసిపి ప్రభుత్వ ప్రతిష్ట

భూకబ్జాలు, ఆర్థిక నేరాల ఆరోపణల నేపథ్యంలో అధిష్ఠానం ఆందోళన

విశాఖ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సాగిస్తున్న భూ దందాలపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టిసారించినట్టు చెబుతున్నారు. వరుస సంఘటనలతో వైసిపి ప్రభుత్వ ప్రతిష్ట మసకబార్చింది.

ఇప్పటివరకూ ఆరోపణలు/విమర్శలు వచ్చిన అంశాలతోపాటు తాజాగా వెలుగులోకి వచ్చిన కొమ్మాది భూ వివాదం, ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే అభియోగంపై ఒడిశా సీఐడీ పోలీసుల అదుపులో వున్న ‘వెల్ఫేర్‌’ యజమాని, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసుల ద్వారా సేకరిస్తున్నట్టు తెలిసింది.

జిల్లాలో వైసీపీ నేతలు కొందరు భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. తొలిసారి గెలుపొందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని ఒక చెరువును కబ్జా చేశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. విశాఖపట్నం లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి తెలియకుండా విశాఖలో ఏదీ జరగదని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు మధ్య సయోధ్యలేదు.

రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో 125 ఎకరాల భూ వివాదంలో అధికార పార్టీ నేత చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి 2015లో ఇనాందారులైన ‘నున్న’ కుటుంబీకుల వారసులమంటూ ఐదుగురు వ్యక్తులు పత్రాలు తీసుకువచ్చారు. నాటి తహసీల్దార్‌ పడాల్‌ వాళ్లతో కుమ్మక్కై పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసి, ఆన్‌లైన్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు నర్సీపట్నం ఆర్డీఓకు ఫిర్యాదు చేయడంతో ఆయన పాస్‌ పుస్తకాలను రద్దు చేశారు. తమకు పాస్‌ పుస్తకాలు జారీ చేయాలంటూ రైతులు 27-6-2019న (నంబరు డబ్ల్యూపీ 8096/2019) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇంకా తీర్పు వెలువడలేదు. కానీ అధికార పార్టీ నేత, మండల రెవెన్యూ అధికారులు…’నున్న’ కుటుంబీకుల నుంచి భూములు కొనుగోలు చేశామని చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కయ్యారు. భూములకు సంబంధించి ఎటువంటి హక్కు పత్రాలు లేకపోయినప్పటికీ తొమ్మిది మంది పేరిట 125 ఎకరాలను గత నెల 14న తహసీల్దార్‌ మ్యూటేషన్‌ చేసి, ఈ-పాస్‌ పుస్తకాలు మంజూరుచేసి, ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసేశారు. ఇందుకు అధికార పార్టీ నేత ఒకరు రూ.5 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నట్టు రైతులు ఆరోపించారు.

తాజాగా కొమ్మాదిలో ఎన్‌ఆర్‌ఐకు చెందిన భూమిని కారుచౌకగా దక్కించుకోవడానికి ఎమ్మెల్యే కన్నబాబురాజు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ భూమికి ఒరిజినల్‌ డాక్యుమెంట్లు లేవని, దళారులు చెప్పగానే, లాభసాటి బేరం వచ్చిందనుకున్నారు. మొత్తం 12.26 ఎకరాల భూమిని కేవలం రూ.18.7 కోట్లకే చేజిక్కించుకుందామనుకున్నారు. ఇక కొమ్మాదిలో ఎకరా ఎలా లేదన్నా రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే 12.26 ఎకరాల భూమి ధర రూ.100 కోట్లపైనే పలుకుతుంది. కానీ అక్కడ ప్రభుత్వ రిజిస్ర్టేషన్‌ ధర రూ.2.2 కోట్లు మాత్రమే ఉంది. అది కూడా ఎక్కువ ధర అని, తమకు రూ.1.53 కోట్లకే రిజిస్టర్‌ చేయాలంటూ…ఆ లెక్క ప్రకారమే ఆయన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించారు. సెక్షన్‌ 47-ఏ ప్రకారం తనకు ఆ రేటునే ఫిక్స్‌ చేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం రెగ్యులర్‌ వాటికి భిన్నంగా వుండడంతో అధికారులు ఓ నంబరు వేసి పెండింగ్‌లో పెట్టారు. ఈ బాగోతం పత్రికల్లో రావడం, తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు పడడం జిల్లాలో సంచలనమైంది.

నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల విజయ్‌ప్రసాద్‌ చిట్‌ఫండ్‌, డిపాజిట్‌లు సేకరించి బాధితులకు తిరిగి చెల్లించకపోవడంతో ఒడిశాలో సీఐడీ అధికారులు, ఛత్తీస్‌గఢ్‌లో సీబీఐ అధికారులు కేసులు నమోదుచేశారు. ఈ మేరకు మూడు రోజుల కిందట మళ్ల విజయ్‌ప్రసాద్‌ను ఒడిశా సీఐడీ అధికారులు అరెస్టు చేయడం వైసీపీలో తీవ్ర కలకలం రేపింది.

ఇంటెలిజెన్స్ నివేదిక కోరిన సిఎం ?

ఈ నేపథ్యంలోనే నగరంతోపాటు రూరల్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై వస్తున్న ఆరోపణలపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్టు తెలిసింది. పార్టీ నేతల కదలికలపై నిఘా వుంచాలని ఇంటెలిజెన్స్‌ అధికారులతోపాటు పార్టీలోని కీలక నేతలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. అలాగే ఇప్పటివరకూ వచ్చిన ఆరోపణలు, తలెత్తిన వివాదాలకు సంబంధించిన సమగ్ర సమాచారం తనకు అందించాలని ఇంటెలిజెన్స్‌ అధికారులను ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.

కొమ్మాది భూమి డాక్యుమెంట్‌ విడుదల

చేయవద్దని హైకోర్టు ఆదేశం

రూ.100 కోట్లకుపైగా విలువైన కొమ్మాది భూ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి హైకోర్టుకు చేరింది. భూ యజమాని తుమ్మల కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్య ప్రసన్న దీనిపై కేసు వేశారు. ఫోర్జరీ చేసిన స్పెషల్‌ పవర్‌ పత్రాలతో 12.26 ఎకరాల భూమికి స్టాంపు డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్‌కు పెట్టారని, దానిని రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు పెండింగ్‌లో ఉంచారని, ఆ డాక్యుమెంట్‌ను కశ్యప్‌ డెవలపర్స్‌కు జారీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆమె కోరారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఆ డాక్యుమెంట్‌ను విడుదల చేయవద్దని జిల్లా రిజిస్ట్రార్‌, మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌లకు ఆదేశిస్తూ గురువారం స్టే ఇచ్చారు.

రాజకీయ ఒత్తిళ్లతో తీసుకుంటారని అనుమానం: లక్ష్మీప్రసన్న

ఈ భూమిని కొనుగోలు చేసిన సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు సుకుమారవర్మకు చెందినది కావడంతో ఆయన…అధికారులపై ఒత్తిడి తెచ్చి, పెండింగ్‌లో వున్న డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేయించుకునే అవకాశం వుందని కృష్ణచౌదరి భార్య లక్ష్మీ ప్రసూన  ఆందోళన చెందుతున్నారు. అందుకే వారికి ఆ అవకాశం లేకుండా డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేయకూడదని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు.

రిజిస్ర్టేషన్‌ శాఖలోనూ ఆందోళన

ఈ భూ వివాదంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కాసింత ఆందోళన చెందుతున్నారు. ఇందులో తాము చేసిన తప్పిదం ఏమీ లేకపోయినా సమస్యలు ఎదుర్కొనవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక వెబ్‌ల్యాండ్‌లో డిజిటల్‌ సంతకం పెట్టిన రూరల్‌ తహసీల్దార్‌ సస్పెండ్‌ అయ్యారని, తాము అలాంటి పనులు చేయలేమని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే..పై అధికారులకు సమాధానం చెప్పుకోలేమని నిబంధనల ప్రకారమే ముందుకు వెళతామని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.