కౌశిక్ రెడ్డి నియామకం లాంఛనమే! గవర్నర్ ఆమోదం అనివార్యం!!

ఎమ్మెల్సీ గా కౌశిక్ రెడ్డి నియామకం: గవర్నర్ రాజ్యాంగం పాటించాల్సిందే!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిఫార్సు చేసినప్పటికీ కౌశిక్ రెడ్డి తెలంగాణ శాసన మండలిలోకి ప్రవేశించడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కేసీఆర్ పంపిన సిఫార్సును గవర్నర్ తమిళిసై పెండింగులో పెట్టారు. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ లేఖను కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి పంపించారు. అయితే, దీనిపై ఆమె సెప్టెంబర్ చివరివారంలో మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని సెక్షన్ 163 ప్రకారం ముఖ్యమంత్రి సిఫార్సు ను గవర్నర్ ఆమోదించి తీరాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు ముగ్గురు ఎమ్మెల్సీ ల నియామకంలో విపక్షాలు అభ్యంతరం పెట్టినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా గవర్నర్ ను కలిసి వివరించిన రోజే ఆ నియామకాలు ఖరారు చేస్తూ గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

వినాయ నిమజ్జనం జరిగిన తర్వాత సెప్టెంబర్ మూడోవారంలో శాసనసభ, శాసన మండలి సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అప్పుడే పాడి కౌశిక్ రెడ్డి విషయంపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై పలు కేసులు పెండింగులో ఉన్నాయని బిజెపి తెలంగాణ నాయకులు గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నియామకాన్ని గవర్నర్ పెండింగులో పెట్టారని అంటున్నారు.

స్పోర్ట్స్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డిని శాసన మండలికి సిఫార్సు చేస్తూ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి ఆమోదం తెలిపి ఆగస్టు 1వ తేదీన గవర్నర్ కు పంపించింది. అప్పటి నుంచి ఆ నియామకం రాజ్ భవన్ లో పెండింగులోనే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 కింద ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ ఆమోదించక తప్పదనే ధీమాతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

క్రీడలు, సేవా రంగాల్లో చేసిన సేవలకు గాను కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం శాసన మండలికి సిఫార్సు చేసింది. కౌశిక్ రెడ్డి 2004, 2007 మధ్య హైదరాబాదు తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరి 2018 ఎన్నికల్లో ఈటల రాజేందర్ మీద హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జులై 21వ తేదీన కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరిన 10 రోజుల లోపలే ఆయనను శాసన మండలికి కేసీఆర్ సిఫార్సు చేశారు.

ఆగస్టు 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళిసైని కలిసి ఆమె తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డిని కొత్తగా శాసన మండలికి నామినేట్ అయిన ఎమ్మెల్సీగా హరీష్ రావు తమిళిసైకి పరిచయం చేసినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.