విజయసాయి వినతిపై అభ్యంతరం: వాదనలకు సిధ్ధమన్న ఈడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై గురువారంనాడు సిబీఐ,ఈడీ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఏ2 -విజయసాయి రెడ్డి దాఖలు చేసిన మెమోపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
మొదట సీబీఐ కేసుల్లో విచారణ జరపాలన్న విజయసాయి రెడ్డి అభ్యర్థనను ఈసీ తప్పు పట్టింది. గత మూడు వాయిదాల్లోనూ విజయసాయి రెడ్డి ఇదే విషయం చెప్పారని ఈడీ గుర్తుచేసింది. ఈడీ కేసుల్లో నమోదైన చార్జిషీట్లపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని ఈడీ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో విచారణనను ఈ నెల 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.దీంతో విజయసాయి రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు కోర్టుకు తెలిపారు. మొదట ఈడీ కేసులపై విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇండియా సిమెంట్స్ కేసులో జగన్,విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై విచారణ జరగ్గా దీనిపై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. దీంతో ఈ నెల 17కి కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.చార్జిషీట్ నుంచి శామ్యూల్ పేరును తొలగించవద్దని కోరింది. ఓబుళాపురం గనుల కేసుపై కూడా సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు వినిపించని పక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని కోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ఈ నెల 13కి వాయిదా పడింది.

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించవచ్చంటూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత, లేదంటే సీబీఐ కేసులతోపాటు కలిపి విచారించాలని నిందితులు మొదట సీబీఐ కోర్టును అభ్యర్థించగా కోర్టు అందుకు తిరస్కరించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో నిందితులకు గట్టి షాక్ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు విజయసాయి రెడ్డి,ఇతర నిందితులు సిద్ధమవుతున్నారు.

మొదట సీబీఐ కేసులపై విచారణ జరిపి ఆ తర్వాత ఈడీ కేసులను విచారించాలని విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు పట్టుబడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈడీ కేసుల్లో విచారణ పూర్తయితే శిక్షలు వేగంగా అమలవుతాయి కాబట్టే మొదట సీబీఐ కేసుల విచారణ జరపాలని పట్టుబడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈడీ కేసులు ఆర్థిక అక్రమాల అభియోగాలతో కూడినవి కావడంతో విచారణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ మొదట సీబీఐ కేసుల విచారణ జరిగితే విచారణపై పొడగింపులు కోరే అవకాశం ఉండొచ్చునని  న్యాయ నిపుణులు  చెబుతున్నారు. అందుకే ఈడీ కేసులను పక్కనపెట్టి సీబీఐ కేసులపై విచారణ జరపాలని నిందితులు పట్టుబడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే ఎప్పటికైనా ఈడీ కేసుల విచారణను ఎదుర్కోక తప్పదనేది అందరికీ తెలిసిందే.ఒకవేళ సుప్రీం కోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చినా అది తాత్కాలిక ఊరటే అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.