ఒడిషా గ్రామాల్లో దూకుడు తగ్గించండి: ఏపి సిఎంకి కేంద్రమంత్రి లేఖ

ఆంధ్రప్రదేశ్-ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన గ్రామ సమస్యలు పరిష్కారం కోసం చొరవ చూపాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. ఇటీవల కాలంలో విజయనగరం జిల్లాలో కొటియా సమూహ 20 గ్రామాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి . తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మందస , కాశీబుగ్గ సమీప ఒడిషా సరిహద్దు గ్రామాల్లో వివాదాలు తలెత్తాయి. మాణిక్యపట్నాలో అంగన్ వాడీ కేంద్రానికి ఒడిషా అధికారులు సీజ్ చేయగా , ఒడిషా రెవెన్యూశాఖ అధికారులపై కేసు పెట్టాలని ఆంధ్రామంత్రి సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు.

ఒడిషా బిజెపి నాయకులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బిజెపి ఉపాధ్యక్షుడు ఇటీవల ఆరోపించారు.

సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఇరు రాష్ట్రాలూ చర్చించుకోవాలని తేల్చి చెప్పేయడంతో ఇక చేసేది లేక కొటియా గ్రామాలపై వ్యక్తిగతంగా అయినా మాట్లాడుకుందామని సీఎం జగన్ కు ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా చేతులెత్తేయడంతో ఈ వ్యవహారంలో జగన్ చొరవ చూపితే తప్ప సమస్య పరిష్కారం కాని పరిస్ధితి వచ్చేసింది.

కొటియా గ్రామాల వివాదం

ఏపీ-ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల వివాదం స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉంది. పరిష్కారం కోసం దశాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఏపీ-ఒడిశా ప్రభుత్వాలు ఎక్కడా పట్టు వీడకపోవడంతో ఇది సుదీర్ఘ వివాదంగా మిగిలిపోయింది. దీంతో ఇప్పటికీ కొటియా గ్రామాల గురించి మూడో తరం కూడా చర్చించుకుంటూనే ఉంది. ఇప్పటికీ సరిహద్దుల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజల మధ్య ఈ వివాదం నిప్పు రాజేస్తూనే ఉంది. ఈ గ్రామాలపై పట్టు కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా ప్రత్యర్ధుల నుంచి మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో ఎవరికీ పూర్తిగా పట్టు చిక్కడం లేదు.

 

జగన్ ప్రభుత్వం లో మారిన చిత్రం

2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు కొటియా గ్రామాల వివాదం గురించి మరీ ఎక్కువగా చర్చలు ఉండేవి కావు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సత్సంబంధాలు కొనసాగించేందుకే అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రయత్నించడంతో ఈ వివాదం విషయంలో దూకుడుగా ముందుకెళ్లేవి కావు. అయితే ఏదైనా సమస్య తలెత్తితే మాత్రం వెంటనే రంగంలోకి దిగి తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేవి. కానీ జగన్ సీఎం అయ్యాక మాత్రం లెక్కలు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న పలు నిర్ణయాలతో కొటియా గ్రామాలపై ఒడిశాకు ఇబ్బందులు మొదలయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి.

సీరియస్ గా తీసుకోని జగన్ సర్కార్!

ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కొటియా గ్రామాలపై ఇరు రాష్ట్రాల్లో ఎవరికీ పట్టు లేదన్న సంగతిని గ్రహించిన జగన్.. అధికారంలోకి రాగానే కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అక్కడ అభివృద్ధి లేమి, పేదరికాన్ని గ్రహించిన జగన్.. తన అధికారుల్ని పంపి అక్కడ కూడా ఏపీ తరహాలోనే నవరత్నాల పథకాలను అమలు చేయడం మొదలుపెట్టేశారు. అక్కడి ప్రజలకు ప్రభుత్వంపై భరోసా కల్పించారు. దీంతో పాటు తాజాగా పంచాయతీ, పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేశారు. ఇందులో అక్కడి ప్రజలు పాల్గొనేలా చేశారు. అదే సమయంలో ఈ గ్రామాల్లో మావోయిస్టుల ఏరివేతకు ఏపీ పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఒడిషా అధికారులు సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు.

 

అన్నీ గమనిస్తున్న నవీన్ సర్కారు

ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సీనియర్ రాజకీయవేత్త, కొటియా గ్రామాల సమస్యను మూడు దశాబ్దాలుగా గమనిస్తున్న నవీన్ పట్నాయక్..ఏపీలో ప్రభుత్వాలతో చర్చించి వివాద పరిష్కారానికి చొరవ చూపాల్సి వుంది. అయితే సుప్రీం కోర్టు యధాపూర్వ స్ధితిని కొనసాగించాలని ఆదేశించింది. దాంతో ఒడిషా ప్రభుత్వం దూకుడుగా పోవడంలేదు. అయితే ఒడిషా ఉదాసీనంగా ఉందని భావిస్తున్న ఏపి అధికారులు ఒకడుగు ముందుకు వేస్తున్నారు. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కొటియా గ్రామాలకు వెళ్లడం మొదలుపెట్టారు. వైసీపీ నవరత్నాల అమలుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకునేందుకు నవీన్ పట్నాయక్ ఒడిశా అఖిలపక్ష నేతల్ని సైతం అక్కడికి పంపినా తాత్కాలికంగా మాత్రమే వివాదం సద్దుమణిగేలా చేయగలిగారు.

రంగంలోకి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ఎప్పుడైతే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సర్కార్ కొటియా గ్రామాలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పనిచేస్తోందో అప్పుడే అక్కడ బీజేపీ రాజకీయాలు చేయడం మొదలు పెట్టింది. నవీన్ పట్నాయక్ పై పైచేయి కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్ధితి. దీంతో కేంద్రం జోక్యం చేసుకోవాలనే ఒత్తిడి పెరగడం మొదలైంది. ఒడిశా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పైనా ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది. దీంతో ఒడిశాలో అఖిలపక్ష నేతలంతా కలిసి జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసే బాధ్యతను ధర్మేంద్ర ప్రధాన్ కే అప్పగించేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ధర్మేంద్ర ప్రధాన్… కొటియా గ్రామాల సమస్యపై ఏపీ సీఎం జగన్ కు తాజాగా మూడు పేజీల లేఖ రాశారు. దీనిపై వెంటనే స్పందించాలని కోరారు.

జగన్ కు ధర్మేంద్ర ప్రధాన్ ఆఫర్ ఇదే

ఒడిశా కొటియా గ్రామాల సమస్య పరిష్కారం కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. అందులో కీలక విషయాల్ని ప్రస్తావించారు. పలు సమస్యల పరిష్కారం కోరారు. దూకుడు తగ్గించుకోవాలని సూచించారు. కొటియా గ్రామాలకు పంపిన పోలీసులు, సాయుధ బలగాలను వెనక్కి పిలిపించాలని, ఒడిశా ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ప్రధాన్ కోరారు. మౌలిక వసతులతో పాటు విద్య,వైద్యంపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని, మిగిలిన నిర్మాణాలు, భూమి తవ్వకాలు ఆపేయాలని కోరారు. కొటియా సమస్య పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాలన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల అధికారుల స్ధాయిలోనూ చర్చలు ప్రారంభించాలని కోరారు. ఫైనల్ గా మా రాష్ట్రంలోని కోరాపుట్, గజపతి జిల్లాల ప్రజల బాధ చూడలేకపోతున్నా, అందుకే మనిద్దరం వ్యక్తిగతంగా కూర్చుని చర్చించుకునేందుకూ సిద్ధమని కేంద్రమంత్రి సీఎం జగన్ కు ఆఫర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.