వినాయక చవితి ఉత్సవాలపై బిజెపి ఆందోళన

వినాయక చవితి ఉత్సవాలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బిజెపి ఆందోళన ప్రారంభించింది. ఆదివారంనాడు కర్నూలులో కలెక్టర్ ఇంటి ముట్టడికి యత్నించిన బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును ,విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఈసారి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అందరూ భావిస్తున్నారు. మరో ఐదురోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జగన్ సర్కారు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు ఏపీలో కాకరేపుతున్నాయి.

కరోనా నేపథ్యంలో గణేష్ ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ యథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. మండపాలకు, ఊరేగింపులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. నిమజ్జనాలు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులపై బీజేపీ నేతలు గరంగరం అవుతున్నారు. ఏ పండుగలకు లేని ఆంక్షలు వినాయక ఉత్సవాలకే ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గుడ్ ఫ్రైడ్, మొహర్రం పండుగలు నిర్వహించారని వారు గుర్తు చేశారు. దీనికితోడు ఇటీవల థియేటర్లు, పాఠశాలలను తెరిచారని, వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వాటిన్నింటికి వర్తించని కరోనా నిబంధనలు కేవలం హిందూ పండుగలకే ఎందుకు వర్తింపజేస్తారంటూ జగన్ సర్కారును బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కరోనా టైంలో తమకు కూడా ప్రజారోగ్యం ముఖ్యమేనని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పండుగ నిర్వహించుకునేలా ప్రభుత్వం ఆదేశాలని ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

అయితే వైసీపీ మాత్రం అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాలపై ఇలాంటి నిబంధనలు విధించామని చెబుతోంది. గణేష్ ఉత్సవాల్లో జనాలు గుమ్మిగూడే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రజలంతా కరోనా నిబంధనలకు అలవాటుపడిన క్రమంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తే ఏమవుతుందని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ప్రభుత్వం ఆంక్షలు విధించడం కరెక్టేనని అంటున్నారు. ఏదిఏమైనా గణేష్ ఉత్సవాలను కేంద్రంగా చేసుకొని ఏపీలో బీజేపీ వర్సెస్ వైఎస్సాఆర్సీపీ మధ్య ఆందోళనలు పెరిగాయి. ఆదివారం నాటి ఘటనలతో బిజెపి మరింత దూకుడు ప్రదర్శించేవీలుంది.

Leave A Reply

Your email address will not be published.