సిఎంల మార్పుల్లో బిజెపి- కాంగ్రెస్ పోటాపోటీ

అంతకంటే వేగంగా ప్రధాని నరేంద్ర మోడీ, హొంమంత్రి అమిత్‌షా ద్వయం ఈమూడు మాసాలలో అయిదుగురు ముఖ్యమంత్రులను మార్చేశారు. 2014లో మోడీ అధికారం చేపట్టాక వారే ఎంపిక చేసిన 20మంది ముఖ్యమంత్రులలో తొమ్మిది తలకాయలు మారాయి. ఇది పాలకపార్టీలో పాతుకుపోయిన అవిశ్వాసానికి ప్రతిబింబమా? పార్టీలో ప్రభుత్వాలలో తమ మాటకు తిరుగులేదనే ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇదోమార్గంగా ఎంచుకున్నారా? ముఖ్యమంత్రులను దిష్టిబొమ్మలుగా చేయదల్చు కున్నారా? శాసనసభల ఎన్నికలలో మోడీ మ్యాజిక్‌ పనిచేయడం లేదు గనక విగ్రహాలు మార్చి మాయ చేయాలనుకుంటున్నారా?
ఒకేచోట మూడుసార్లు మార్పు
ఉత్తరాఖండ్‌లో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చడంతో ఈ ప్రహసనం మొదలైంది. త్రినాథ్‌సింగ్‌ రావత్‌ స్థానంలో 2021ఫిబ్రవరిలోనే తీర్థసింగ్‌రావత్‌ను నియమించారు. వచ్చేఏడాది ఆరంభంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వస్తాయి గనక ముందస్తు జాగ్రత్తగా ఈమార్పు జరిగిందనుకున్నారు. గత మేలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు చూశాక ఈ అంచనా మారింది. తీర్థసింగ్‌ రావత్‌ ఆరెస్సెస్‌ మార్కు హిందూత్వ వాదాన్ని శ్రుతిమించి నెత్తికెత్తుకుని పాలనలో అసమర్థత చాటుకున్నారు. ఎంపీగా ఉన్న ఈయన సెప్టెంబరులోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉండింది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఇరకాటంలో పెట్టడం కోసం ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రచారం సాగింది. ఆ ముసుగులో తీర్థసింగ్‌ను తప్పించి పుష్కర్‌ సింగ్‌దామీని ఎన్నుకున్నారు.
యెడ్డికి స్వస్తి
కర్నాటకలో గాలి జనార్ధనరెడ్డి వంటి బడాబాబులకు లోబడిపోయి లింగాయత్‌ కార్డు కూడా ప్రయోగించి తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యెడ్యూరప్ప, ఆ అవినీతి ఆరోపణలతోనే గతంలో తొలగించబడ్డారు. స్వంతంగా పార్టీ పెట్టుకుని విఫలమై మళ్లీ బీజేపీలో చేరారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర వహించి మళ్లీ సిఎం అయ్యారు. 78ఏండ్ల యెడ్యూరప్పను మార్చడం జరుగుతుందని కథనాలు వస్తున్నా ఆయన ముఠాలను సమీకరిస్తూ నెట్టుకొచ్చారు. అయినా అధిష్టానం తన స్థానంలో బసవరాజ్‌బొమ్మైని ఎంపిక చేసింది. దక్షిణాదిన తమకు అవకాశమున్న ఒకే రాష్ట్రంలో మళ్లీ గెలవడం కష్టమన్న అంచనానే ఇందుకుకారణమన్నది స్పష్టం. అయినా ఇప్పటికీ బొమ్మైతో యెడ్యూరప్ప వర్గం సఖ్యతగా ఉండటం లేదు. అనేక నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. ఈమధ్యనే గాలి జనార్ధనరెడ్డికి స్వంత జిల్లా బళ్లారిలో పర్యటించేందుకు బెయిలు నిబంధనలు సడలించి సుప్రీం అనుమతినిచ్చింది. బసవరాజు ఆ వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు ఎన్ని తంటాలు పడినా యెడ్యూరప్ప లోలోపల మంత్రాంగం సాగిస్తున్నారు.
అస్సాంలో ఆరంభం
మొన్న మేలో బీజేపీ అధికారం నిలబెట్టుకున్న రాష్ట్రం అస్సాంలో ముఖ్యమంత్రి సర్వానంద సోనేవాల్‌ను గాక హేమంత బిస్వాస్‌శర్మను నియమించినపుడే ఈమార్పులు మొదలైనాయి. ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా శర్మ గతసారి ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. రాగానే సిఎంను చేస్తే జీర్ణం కాదనే సంకోచంతో అప్పటికి సోనేవాల్‌ను ఎంపిక చేసి శర్మకు ఈశాన్య రాష్ట్రాల బాధ్యత అప్పగించారు. ఆయన ఫిరాయింపు ఎత్తుగడలతో చాలాచోట్ల బీజేపీకి అధికారంలో చోటు సాధించారు. అస్సాం పీఠం ఎక్కిస్తే ఆరెస్సెస్‌ను మెప్పించడం కోసం అడుగడుగునా అతిగా వ్యవహరిస్తున్నారు.
స్వంతపీఠం గుజరాత్‌లో
ఇవన్నీ ఒక ఎత్తుకాగా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో విజరురూపానీని తప్పించి భూపేంద్ర పటేట్‌ను పూర్తి కొత్త మంత్రులతో నియమించారు. ఈ ఏడేండ్లలో గుజరాత్‌లో ఇది మూడో మార్పు. మోడీ ప్రధాని కాగానే ఆనందిబెన్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. తర్వాత రూపానీని తెచ్చారు. 2017లో అత్తెసరు మెజార్టితోనే అధికారానికి రావడం, పరిపాలన అసమర్థంగా సాగడం, ఇటీవల కోవిడ్‌ను ఎదుర్కొవడంలో ఘోర వైఫల్యం మార్పునకు కారణాలుగా చెబుతున్నారు. అయితే దీని బాధ్యత మోడీకే ఆపాదించాల్సి ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరిని కూర్చోబెట్టినా వాస్తవాధికారం ఆయనచేతిలోనే పెట్టుకున్నారు. మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడైన కైలాసనాథన్‌ అనే అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో నిజమైన నిర్ణయాధికారం చలాయిస్తుంటారు. ఆయనకు మూడుసార్లు పదవీకాలం పొడిగించారు. గుజరాత్‌ అంతటా మోడీ ప్రచారమే నడుస్తుంటుంది గాని రాష్ట్రనేతలది కాదు. ఆనందిబెన్‌ను ఎన్నికలకు 16నెలల ముందు, రూపానీని 15 నెలల ముందు తప్పించారు. గుజరాత్‌ నమూనాను చూపించి దేశంలో గెలిచిన వారు అక్కడే ఎందుకు ఇన్ని మల్లగుల్లాలు పడుతున్నారు? రాష్ట్రాలలోనూ తన బొమ్మతోనే గెలుస్తామని బీరాలుపోయే మోడీ సిఎంలను ఎందుకు మారుస్తున్నారు? వారిని మార్చడం ద్వారా పార్టీ రాజకీయ బాధ్యతనే గాక వ్యక్తిగతంగా తన భారం కూడా దింపుకుంటారన్న మాట.
మరో ఆరురాష్ట్రాల పరిస్థితి
దేశంలో కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాలుంటే బీజేపీకి స్వంతంగా పదిరాష్ట్రాలు మిగిలాయి. వీటిలో గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, (ఉత్తరాఖండ్‌తోసహా) చేజారిపోవచ్చని మోడీ బృందం భావిస్తున్నది. హిమాచల్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ఠాగూర్‌, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కూడా వేటు పడుతుందని సిద్ధమై ఉన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌, జార్ఖండ్‌లో రఘువీరదాస్‌ ఇప్పటికే పదవి కోల్పోయారు. అన్నిటికన్నా పెద్దరాష్ట్రమైన యూపీలో యోగిఆదిత్యనాథ్‌ను మార్చబోయి చివరి నిముషంలో ఆగారు. మధ్యప్రదేశ్‌లోనూ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గాక కొత్తవారి నాయకత్వంలో వెళితే ఉపయోగమని అంచనాలు వేస్తున్నారు. గుజరాత్‌లోలాగే అక్కడకూడా హఠాత్తుగా ఈమార్పు జరిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదంతా మోడీ షా ద్వయం ఆధిపత్య ప్రదర్శనగా కొంతమంది చెబుతున్న వివరణ పాక్షికమైంది మాత్రమే. మేడిపండు చందంగా మారిన బీజేపీ అభద్రత దీనికి మూల కారణం. త్రిపుర వంటిచోట ఘోరమైన నిర్బంధానికీ దాడులకూ తెగబడుతున్నారు. ప్రత్యర్థులపై కేంద్ర సంస్థలను ప్రయోగించడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం దీనికి మరోకోణం. మోడీమోత, మతరాజకీయాలు గట్టెక్కించగల స్థితి మారిపోయి ఆయనపట్ల ఆదరణ తగ్గుముఖం పట్టినట్టు సర్వేలు ఎన్నికలు కూడా వెల్లడిస్తున్న పూర్వరంగంలో, రైతాంగఆందోళన, కార్పొరేట్‌లకు సర్వం ధారాదత్తం చేస్తున్న తీరుపై నిరసన, దేశవ్యాపిత ఉద్యమాలుగా బంద్‌లుగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి కాయకల్ప చికిత్సలు బీజేపీని గట్టెక్కించడం సులభంగా జరిగేది కాదు.
– (తెలకపల్లి రవి.సౌజన్యంతో)

Leave A Reply

Your email address will not be published.