ఒకసారి లబ్దిదారుని ఎంపిక చేస్తే అదే ఫైనల్

అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావడం, కరోనా కష్టాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు దారుణంగా తలకిందులు కావడం, కొత్తగా అప్పులు కూడా పుట్టే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం చేసేది లేక సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తోంది. అక్రమాల పేరుతో లబ్దిదారులకు పించన్లు, రేషన్ కార్డులు తొలగిస్తోంది. దీంతో కొందరు (వారు )లబోదిబోమంటున్నారు. దీంతో వారు కోర్టులను ఆశ్రయించారు.

 

రెండేళ్ల తర్వాత కోతలు మొదలు

వైసీపీ సర్కార్ రెండేళ్లు పూర్తి చేసకున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల్లో కోతలు మొదలయ్యాయి.

జగన్ సర్కార్ కోతలపై హైకోర్టు షాక్

జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్దిదారులకు ఇప్పటివరకూ అందుతున్నా తాజాగా కోతలు మొదలయ్యాయి. ఇలా సంక్షేమ పథకాల నుంచి తొలగించిన లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించడం మొదలుపెట్టారు.

రాష్ట్రంలో వైసీపీ సర్కార్ నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కులం, మతం, ప్రాంతం, వర్దం, పార్టీ చూడబోమని గతంలో సీఎం జగన్ పలుమార్లు ప్రకటించారు. అయితే తాజాగా రాజకీయ, ఇతరత్రా కారణాలతో సంక్షేమ పథకాలు నిలిపేస్తున్నారు. ఇలా కృష్ణా జిల్లాలో వైఎస్సార్ చేయూత పథకం వర్తించకుండా కొందరికి కోతలు విధించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంక్షేమ పథకాలు తొలగించడం కుదరదని వైసీపీ సర్కార్ కు తేల్చిచెప్పేసింది. వివిధ కారణాలతో పేర్లు తొలగించిన లబ్దిదారులకు హైకోర్టు ఉత్తర్వులు ఊరటనిచ్చేలా ఉన్నాయి. మరి వీటి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఓసారి ఇస్తే అదే ఫైనల్

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఓసారి ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏ కారణంతో అయినా ఆపేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో, ఇతరత్రా కారణాలతో సంక్షేమ పథకాలు నిలిపేయడం కుదరదని తెలిపింది. అంతే కాదు ఓసారి లబ్దిదారులు అర్హుడని నిర్ణయించాక మళ్లీ అతను ఎందుకు అనర్హుడు అవుతున్నాడని హైకోర్టు ప్రశ్నించింది. తాజాగా ప్రభుత్వం అనర్హులు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారనే కారణంతో కోతలు పెడుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వాలంటీర్లు చెప్తే తీసేస్తారా ?

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని గుర్తించడానికి, వారికి పథకాలు కొనసాగించడానికి ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధ నడుపుతోంది. అయితే వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని వివిధ కారణాలతో తొలగించాలని ప్రభుత్వానికి సిపార్సులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వారి పేర్లు తొలగిస్తోంది. ఈ వ్యవహారంపైనా హైకోర్టు స్పందించింది. వాలంటీర్లు చెప్తే లబ్దిదారుల్ని అనర్హుల్ని చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వారేమైనా ప్రభుత్వ ఉద్యోగులా అని సర్కార్ ను నిలదీసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు (సీఎస్) అయినా సర్వీసు రూల్స్ ఉన్నాయి కానీ వాలంటీర్లకు మాత్రం లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వాలంటీర్లకు నచ్చితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి లేదంటే సంక్షేమ కార్యదర్శికి చెప్పి పేర్లు తొలగిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.

జగన్ సర్కార్ కు మరిన్ని కష్టాలు ?

అసలే ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతూ, కరోనా కష్టాలతో పూర్తిగా కుదేలైన వైసీపీ సర్కార్ కు హైకోర్టు తాజా ఆదేశాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సంక్షేమాన్ని కొనసాగించాలా లేక కోతలు విధించాలో తేల్చుకోలేని పరిస్ధితి. ఇప్పటికే సంక్షేమంలో కోతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అలాగని అందరికీ పథకాలు వర్తింపజేయలేని దుస్ధితి. దీంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని పథకాలను కోతల్లేకుండా అమలు చేసే పరిస్ధితి లేక, అలాగని హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయక కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోలేక జగన్ సర్కార్ పరిస్ధితి ముందుగొయ్యి, వెనుక నుయ్యిగా మారిపోతోంది. దీంతో రాబోయే రోజుల్లో సంక్షేమ భారం ఎదుర్కోక తప్పని పరిస్ధితులు జగన్ సర్కార్ ను మరింత చికాకు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.