రెండు సంవత్సరాల్లో నలుగురు సిఎస్ లు!

జగన్ రెడ్డి మరో రికార్డు!!

జగన్ రెడ్డి సర్కారు మరో రికార్డు!

రెండు సంవత్సరాల నాలుగు నెలల్లో

నలుగురు సిఎస్ లు…!

ఆంధ్ర ప్రదేశ్ వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టి రెండేళ్లు గ‌డిచిపోయాయి. ఈ రెండేళ్ళలో తన ఇష్టారాజ్యంగా ఐఏఎస్ లతో ఆడుకున్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ను ఆరు నెలలకే  సాగనంపి ఢిల్లీలో ఉన్న నీలం సాహ్నీని తెచ్చుకున్నారు. కరోనా పుణ్యమా అని మరో ఆరు నెలలు అసాధారణంగా కొనసాగించారు. ఆతర్వాత ఆదిత్యనాధ్ ను తీసుకు వచ్చారు. ఈయన సేవలు విశేషంగా ఉపయోగించుకుని ఇప్పుడు మరో మూడు నెలల పొడిగింపు లేకుండానే 20 రోజులు ముందే కొత్త సిఎస్ ను నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.

ఈ రెండేళ్ల‌లో జగన్ వ‌ద్ద న‌లుగురు సిఎస్ లు ప‌నిచేశారు. ఒక రకంగా ఇది రికార్డే. ఒక ప్ర‌భుత్వ ఐదేళ్ల కాలంలో మ‌హా అయితే ఇద్ద‌రో ముగ్గురో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లు ప‌నిచేస్తారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌లో న‌లుగురు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులను నియ‌మించుకోవడం అరుదైన ఘ‌ట‌నే. రెండేళ్ల‌కే న‌లుగురు సిఎస్ లు మారిపోతే,  రాబోయే రెండున్న‌రేళ్ల‌లో మ‌రో న‌లుగురు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా పని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్న చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో ముఖ్య‌మంత్రి త‌రువాత సిఎస్ దే ముఖ్య‌పాత్ర‌. పాల‌నా వ్య‌వ‌హారాలన్నీ ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి పేరుమీదే న‌డుస్తుంటాయి. విధాన నిర్ణ‌యాలు ప్ర‌భుత్వ పెద్ద‌లు తీసుకుంటే వాటిని అమ‌లు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిది. గ‌తంలో ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శికి విశేష‌మైన అధికారాలు ఉండేవి. ఏ విష‌య‌మైనా ముఖ్య‌మంత్రులు వారి అభిప్రాయం తీసుకుని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకునేవారు. అయితే ప్ర‌స్తుతం అటువంటి సాంప్ర‌దాయాలు క‌నిపించ‌డంలేదు. ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా గుడ్డిగా అమ‌లు చేయ‌డం నేటి సిఎస్ లు అనుస‌రిస్తున్న వైఖ‌రి. ప్ర‌భుత్వ పెద్ద‌లు తాము తీసుకున్న నిర్ణ‌యాల‌ను య‌ధాతథంగా అమ‌లు చేసేవారికే సిఎస్ పోస్టును క‌ట్ట‌బెడుతున్నారు. త‌మ మాట వినేవారికి రెండు మూడు నెల‌లు స‌ర్వీసు ఉన్నా వారిని సిఎస్ గా నియ‌మిస్తున్నారు.  ‘జ‌గ‌న్’ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏ కార‌ణాల‌వ‌ల‌నైతేనేమి ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు సిఎస్ లుగా నియ‌మితుల‌య్యారు. సాధారణంగా ఐఏఎస్ ల స‌ర్వీసుల పద‌వీకాలాన్నిపొడిగించాలంటే ప్ర‌ధాని మోడీ అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేస్తారని చెబుతూవుంటారు. సర్వీసు పొడిగింపుల వ్యవహారం వ‌ద్ద‌ని ఆయ‌న డీఒపీటీ అధికారుల‌కు గ‌ట్టిగా చెప్పారట. దీంతో అప్ప‌ట్లో ఆంధ్రా నుంచి, తెలంగాణ నుంచి సిఎస్ లుగా ఉన్న అధికారుల స‌ర్వీసును పొడిగించాల‌ని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కోరినా ఆయ‌న అంగీక‌రించ‌లేదు. అయితే కరోనా మొదటి దశ నుంచీ ఈ విధానంలో మార్పు వచ్చిందంటున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ‘జ‌గ‌న్’ ‘నీలం స‌హానీ’ ప‌ద‌వీకాలం మొదట మూడు నెలలు పొడిగించాల‌ని కోరిన వెంట‌నే ప్రధాని అంగీక‌రించారు. ఆత‌రువాత మరో మూడు నెలలు పొడిగించారు. సాధారణ ప్రతిభ కూడాలేని ఆమె అన్యూహ్యంగా ఆరు నెలలు పదవీ కాలం పొడిగింపు పొందారు. ఆపై ముఖ్యమంత్రి కీ ముఖ్యసలహాదారుగా నియమితులయ్యారు. నాలుగు నెలల కాలం తర్వాత అనూహ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆమె నియామకం ప్రస్తుతం కోర్టు తీర్పుపై ఆధారపడి వుంది.  ప్ర‌స్తుతం సిఎస్ గా ఉన్న ‘ఆదిత్య‌నాధ్ దాస్’ ప‌ద‌వీకాలాన్ని కూడా మూడు నెలలు పొడిగించారు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌ర్వీసు ఈ నెల 30వ తేదీతో ముగిసిపోయింది. దాస్ కు మరో మూడు నెలలు పదవీకాలం పొడిగిస్తారనుకున్నారు. మరి ఎందుచేతనో 20 రోజులు ముందే ఆయన పదవీ కాలం సెప్టెంబర్ 30న ముగుస్తుందని, కొత్త సిఎస్ ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు పాలనాకాలం లో కూడా అయిదేళ్ళలో నలుగురు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఐవైఆర్ కృష్ణారావు , ఎస్పీ టక్కర్ , అజయ్ కల్లం , అనిల్ చంద్రపునేఠా సిఎస్ లుగా పనిచేసినా అజయ్ కల్లం అతి తక్కువ కాలం పనిచేశారు. ఆయనకు మూడు నెలలు పొడిగింపు ఇస్తామని చెప్పారు. కానీ అది అమలు కాలేదు. ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా సిఎస్ ల నియామకాలు మారిపోయాయి. 1987 బ్యాచ్ కు చెందిన దాస్ ను మొదట సిఎస్ గా నియమించి ఇప్పుడు 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మను నియమించడం ఏమిటో ఐఏఎస్ అధికారులకే అర్ధం కావడంలేదు.

దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వం మ‌రో రెండు నెల‌లు స‌ర్వీసు ఉన్న ‘స‌మీర్ శ‌ర్మ’ను సిఎస్ గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. కేవ‌లం రెండు నెల‌లు స‌ర్వీసు ఉన్న అధికారుల‌ను సిఎస్ గా నియ‌మించుకోవడం త‌రువాత వారి ప‌ద‌వీకాలాన్ని పొడిగించుకోవ‌డం ప్ర‌స్తుతం ఆచారంగా సాగుతోంది. ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు ఐఎఎస్ అధికారులు ప్రైవేట్ సంభాష‌ణ‌ల్లో అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద సిఎస్ ల నియామ‌కం విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి తీవ్ర వివాదానికి కార‌ణం అవుతోంది. ఈ వ్య‌వ‌హారంలో కేంద్రం తీరుపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పారద‌ర్శ‌క‌మైన ప్ర‌భుత్వం అని చెప్పుకునే బిజెపి కేంద్ర స‌ర్వీసు అధికారుల విష‌యంలో ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించ‌డంతో వారి పార‌ద‌ర్శ‌క‌త నేతిబీర చంద‌మే అనే మాట స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.