మమతా దాదా గిరీ!

*మమతా దీదీ గిరి*…..!?
అయ్యో! ఇక్కడేనా రవీంద్రుడు శాంతినికేతన గీతం ఆలపించాడు… బాబోయ్ ఇక్కడేనా! బంకింగ్ చంద్రుడు వందేమాతర గీతానికి రూపుదిద్దాడు… ఈ గడ్డపైన పుట్టిన స్వామి వివేకానందుడా కాషాయ వస్త్రాలు ధరించి ప్రపంచానికి సింహ గర్జన చేసి వేదాంత ప్రబోధం చేశాడు… ఈ మట్టిలోంచి పుట్టిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ కదా! ఈ దేశంలో ఒక భాగం విముక్తి కోసం తన ప్రాణం వదిలిపెట్టాడు…. మరేంటి ఇప్పుడు చూస్తే….
అంతా గందరగోళం …అయోమయం… ఆందోళన… దాడులు …దుర్మార్గపు హింస.. అత్యాచారాలు ….అయ్య బాబోయ్ 2021 లోనే ఉన్నామా అనిపించాయి … ……. ఆ వీడియోలు …ఆ దృశ్యాలు…!?
అవునులే… ఆనంద మార్గ్ కు సంబంధించిన ఆనందమూర్తి గారిని పురూలియ ఆయుధాల కేసులో ఇరికించిన కమ్యూనిస్టుల అడ్డా కదా… వారే కదా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న హీరోలు… అఫ్కోర్స్ కొందరు బీజేపీలో కూడా ఉండవచ్చు…. ఏదైనా మరోసారి మావో సేటుంగ్ జిన్నా తో కలిసి మమతా బెనర్జీని ఆవహించారు..
కమ్యూనిస్టులపై అగ్రెసివ్ గా పోరాడి బెంగాల్ ను హస్తగతం చేసుకున్నది మమత… కమ్యూనిస్టుల సంతుష్టీకరణ ..దౌర్జన్యం రెండు వంటబట్టించుకున్న ది…. ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ 15 ఏళ్లలో హిందువులను అనేక కష్ట నష్టాలకు గురి చేసింది.. హిందూఉత్సవాల పై నిషేధం విధించింది. దుర్గా ఉత్సవాల పై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన మమత ప్రభుత్వం పై గతంలో హైకోర్టు మొట్టికాయలు వేసింది.. విజయ దశమి తర్వాత వచ్చే మోహర్రాన్ని దృష్టిలో పెట్టుకొని దుర్గామాత నిమజ్జనం త్వరగా చేయాలని ఇంకా అనేక ఆంక్షలు విధించింది. అలాగే ముస్లిం రోహింగ్యాల కు మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టిన మమతా బెనర్జీ దేశ భద్రతను కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు బలిపెట్టే ప్రయత్నం చేసింది. గతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలను బెంగాల్ లో అడుగుపెట్టనివ్వకుండా ర్యాలీలకు సమావేశాలకు అనుమతి ఇవ్వలేదు.. కోయంబత్తూర్ లో జరిగిన ఆర్ ఎస్ ఎస్ సమావేశంలో సంఘం దీనిని వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేసింది. మదర్శాలకు ప్రచారం కల్పిస్తూ మౌల్వీలజీతాలు పెంచింది. మాల్దా… కలియాచక్లలో జరిగిన మత ఘర్షణల్లో ప్రభుత్వం ఒక వర్గం వారికి వెన్నుదన్నుగా నిలిచింది అన్న ఆరోపణలు గుప్పుమన్నాయి .. అయినా మమత తన ప్రవర్తన మార్చుకోలేదు. కమ్యూనిస్టు ,మమత ప్రభుత్వాల నిర్వాకం వల్ల పశ్చిమ బెంగాల్ లో హిందూ జనాభా తగ్గిపోయింది. 1951లో 78.54 % ఉన్న బెంగాల్ హిందూ జనాభా 2011 నాటికి 70.50% పడిపోయింది. అదే బెంగాల్ లో 1951 లో18.63% ఉన్న ముస్లిం జనాభా 2011 నాటికి 27 శాతానికి పెరిగిపోయింది. ఈ కులౌకిక వ్యతిరేక ప్రభుత్వాల కుట్రల వల్ల దేశంలో అస్సాం తర్వాత బెంగాల్లో గణనీయంగా ముస్లిం జనాభా పెరిగింది. దీనికి ప్రధాన కారణం సరిహద్దుల నుండి రాష్ట్రాలకు బంగ్లా చొరబాటుదారులు రావడం. ఆ చొరబాట్లను ప్రభుత్వాల నివారించకపోగా వలసదారులకు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మమత అస్సాంలోని జాతీయ పౌర రిజిస్టర్ కూడా వ్యతిరేకించి పాపం మూటగట్టుకుంది . అయినదానికి కాని దానికి వ్యతిరేకంగా మాట్లాడే మమత చొరబాట్లలను అంతర్గతంగా ప్రేమించడం మొదలుపెట్టి …దానికి లౌకికవాదం అని పేరు పెట్టింది. ఆఖరికి బెంగాల్ లో సరస్వతి పూజ చేసే విద్యార్థులపై ఆంక్షలు విధించింది. స్వయంగా సీఎం హోదాలో మమత టిప్పుసుల్తాన్ ఇమామ్ మౌలానా నూరూర్ రెహమాన్ బర్కతిపక్కన వేదిక పంచుకుంది. ఈ ఇమామ్ ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడు . నోరు పారేసుకున్నాడు .అలాగే మోదీని సమర్థించే ముస్లింలకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. అంతటితో ఊరుకోక మమతా బెనర్జీ ఓ ప్రసిద్ధ దేవాలయానికి మైనార్టీ మతస్తుడిని చైర్మ న్ గా చేసింది. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న జిల్లాల్లో సంతుష్టీకరణ అమలు చేసిన తర్వాత మమత ఇదే విధంగా అన్ని విషయాల్లో బిజెపిని వ్యతిరేకించడం మొదలు పెట్టింది… దాని దుష్పరిణామాలే ఇటీవల ఎన్నికల్లో గెలవగానే హిందువులపై దేశ విభజన జరిగినప్పుడు… బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు జరిగినట్లుగా దాడులు జరిగాయి…
ఇదంతా ఒక కోణం అయితే తాము ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు అయినా సరే మా శత్రువైన మోదీని మమత ఢీకొట్టింది అని గంతులేసే కాంగ్రెస్.. కమ్యూనిస్టుల ఈ వింత వైఖరి ఆశ్చర్యం కలిగించింది… ఏకంగా కమల్నాథ్ మమతను ప్రశంసిస్తూ సన్నాయి నొక్కులు నొక్కినాడు. ఇక
తెలుగు మీడియా పైత్యం చూస్తే.. నవ్వాలో ఏడవాలో…తెలియడం లేదు. ఒకాయన “తూర్పు తీరంలో ఉదయించిన వేగుచుక్క “అని హెడ్డింగ్ పెడితే… మరొక పత్రిక బెంగాల్ టైగర్… బొబ్బిలి పులి ….అని పాత ఎన్టీఆర్ సినిమా టైటిల్స్ వాడేసుకున్నాడు… మరొక పత్రిక ఇంకో సాహసం చేసి బెంగాల్లో జరిగినటువంటి హింసను ఖండించకపోగా ..ఇదంతా దుష్ప్రచారం అంటూ… ఏకంగా సంపాదకీయం రాసింది. మరో పత్రిక మోదీ పని అయిపోయిందినీ … ఆయన ప్రభ తగ్గిందని విశ్లేషణ మొదలుపెట్టింది. కొన్ని టీవీ చానల్స్ ఆస్థాన విద్వాంసులను కూచేపెట్టి మోదీ .. అమిత్ షా లను తిట్టించింది… శహ భాష్….
ఇక జాతీయవాదులు అనుకునే వాళ్ళు చాలామంది బెంగాల్ లో జరిగే హింసకు సంబంధించిన ఫోటోలను.. వీడియోలను షేర్ చేస్తూ జన జాగృతి చేస్తున్నారు… ఇదొక విడ్డూరం.. 70వ 80వ దశకంలో కాశ్మీర్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనకు తెలీదు… తర్వాత తెలిశాక చాలా బాధపడ్డాం .ఇప్పుడు మనం మౌనంగా ఉండడం తగదు… ఇప్పటికైనా మాయికులయందు మాయికుడై ప్రవర్తించ వలెను… అన్న పంచతంత్ర సూత్రాన్ని వంట పట్టించుకోకపోతే మనకూ అదే గతి ….తస్మాత్ జాగ్రత్త…(పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింస పై రాజ కీయ .. సామాజిక విశ్లేషకులు డా.భాస్కర యోగి)

Leave A Reply

Your email address will not be published.