వైద్య పరికరాలు కొనుగోలు కుంభకోణంలో చర్యలు: సోము డిమాండ్

 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన భారీ స్కామ్ పై సీఐడీ కేసును వేగంగా, నిష్పక్షపాతంగా విచారించి దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.  2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణకు ఏపీఎంఎస్ ఐడీసి( APSMIDC) ద్వారా టెండర్లు పిలిచింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియన్ టేలీ మాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ అనే సంస్థకు టెండరు ఖరారు చేసింది. ఈ టెండరు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండరు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో ఏసీబీ విచారణ చేపట్టారు. అవిడి గ్రామానికి చెందిన ఇందుకూరి వెంకటరమణ రాజు ఈ ఫిర్యాదు చేశారు. టెండరు దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే ఎన్నో రెట్టు అమాంతం పెంచేసి మోసానికి పాల్పడింది. ఏడాదికి రూ. 460 కోట్ల భారీ మొత్తానికి టెండరు కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని తెలిసింది. వెంటిలేటర్ రూ. 7.10 లక్షలుంటే దాన్ని రూ.11 లక్షలుగా పెంచి 159 వెంటిలేటర్ల సరఫరా చేశారు. రూ. 140 విలువ చేసే ఒక్కో గ్లూకో మీటరును రూ. 5.08 లక్షలుగా ధర పెంచి 12 గ్లూకో మీటర్ల కొనుగోలు చేశారు. రూ. 1.7 కోట్ల విలువ చేసే ఎమ్మారై మిషన్ (కర్నూలు ఆసుపత్రికి)ను రూ.3.60 కోట్లుగా చూపించారు. మొత్తంగా రూ.300 కోట్లు విలువ చేసే ఉపకరణాల విలువను రూ.500 కోట్లుగా చూపించినట్లు సమాచారం, ఈ అవినీతిలో రూ.200 కోట్ల మేర వేతులు మారాయంటున్నారు. దీనికి అదనంగా 2016-17, 2017-18లో నిర్వహణ వ్యయంగా మరో రూ.24,90 కోట్లు కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వం చెల్లించింది. సీఐడీ ఈ కేసు విచారణను వేగంగా పూర్తిచేసి ఆసలైన దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సోము వీర్రాజు కోరారు.

Leave A Reply

Your email address will not be published.