పెద్ద రాజకీయ నేతకు కష్టాలు: స్వరూపానంద

ఉగాది పర్వదినాన స్వరూపానంద స్వామి పంచాంగ శ్రవణం

శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికిన తెలుగు ప్రజలంతా శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగను జరుపుకొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రావణాలు వారివారికి అనుకూలంగా సాగాయి. ప్రజాదరణ పొందిన పలువురు స్వాముల పంచాంగ పఠనాలకూ ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆంధ్రా, తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా కొనసాగే స్వరూపానందేంద్ర స్వామి పంచాంగ పఠనంలో ఈసారి అనూహ్య విషయాలు చెప్పారు.
నేటి ఉగాది పండుగతో ప్రవేశించిన ప్లవ నామ సంవత్సరం శుభప్రదమైన సంవత్సరమని పండితులు చెబుతున్నారు. ప్లవ అంటే, దాటించునది అని అర్థం. ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుందని, అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అంటున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర మంగళవారం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్లవ అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపడమని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు.
పెద్ద నేతకు ఇబ్బందులు..
ఉగాది వేళ పంచాంగాన్ని ఆవిష్కరించిన స్వరూపానంద.. శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామన్నారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని స్వామి వెల్లడించారు. ఈ ఏడాది ఓ పెద్ద నేతకు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని స్వరూపానంద సెలవిచ్చారు. గ్రహాల అనుకూలత లేనప్పటికీ తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు.
జగన్, కేసీఆర్ జాతకాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయని.. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవన్నారు స్వరూపానందేంద్ర. రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నాను అన్నారు. విశాఖ శారదాపీఠంలో మంగళవారం నుంచి భగవంతుడ్ని, రాజశ్యామల ఆరాధనను విశేష అర్చనలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు, పాలన బావుండాలి, పచ్చని పంట పొలాలతో రైతులు బావుండాలని దేవుడ్ని కోరుకుంటున్నానని స్వామి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.