ఏపి,తెలంగాణ ద్వైపాక్షిక అంశాలపై దృష్టి పెట్టండి

ఏపి తెలంగాణా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి కృషి చేయండి
* కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎ.కె.భల్లా
అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య విభజన అంశాలకు సంబంధించి ద్వైపాక్షిక సమస్యలను పరస్పరం కూర్చుని సామరస్యపూర్వకంగా త్వ‌రితగతిన పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీ నుండి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో ఇరు రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించిన సమస్యలపై వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఎకె భల్లా ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నవివిధ విభజన అంశాలను అడిగి తెల్సుకున్నారు. ఈవీడియో సమావేశంలో ప్రధానంగా డిఎస్పి,ఎడిషనల్ ఎస్పిలు(సివిల్),ఎస్పి(నాన్ కేడర్), షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ఆస్తులు,అప్పులు విభజన,సింగరేణి కాలరీస్ కంపెనీ విభజన అంశాలపై చర్చించారు.అలాగే విభజన చట్టంలోని సెక్షన్లు 50,51,56 ప్రకారం టాక్సేసన్ ప్రావిజన్స్ కల్పించడం, కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు కార్యాలయాన్నిఎపికి తరలించడం, ఢిల్లీలోని ఎపి భవన్ విభజన,ఎపి జెన్కోకు బకాయిలు చెల్లింపు తదితర అంశాలపై ఆయన ఇరు రాష్ట్రాల అధికారాలతో సమీక్షించారు. విభజన చట్టానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పెండింగ్లో ఉన్న వివిధ అంశాలను సకాలంలో సామరస్య పూర్వకంగా త్వరిత గతిన పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాలు తగిన కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆయా సమస్యల పరిష్కారానికి తమవంతు తోడ్పాటును అందిస్తుందని అజయ్ భల్లా స్పష్టం చేశారు. వీడియో సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ విభజన అంశాలపై హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఇరు రాష్ట్రాల అధికారులతో సమీక్షించారు. వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలా బీడే కమిటీని గౌరవించి ఆకమిటీ సిఫార్సుల ప్రకారం విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ పేర్కొన్న సంస్థల విభజన జరిగేలా చూడాలని చెప్పారు.రాష్ట్ర విభజన అనంతరం ఎపి జెన్కో ద్వారా తెలంగాణా డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి రాష్ట్రానికి సుమారు 7వేల కోట్ల రూ.లు వరకూ తెలంగాణా నుండి ఎపి రావాల్సి ఉందని హోం శాఖ కార్యదర్శి దృష్టికి తెచ్చారు. దానిపై హోంశాఖ కార్యదర్శి స్పందించి ఎపి తెలంగాణా రాష్ట్రాల అధికారులు దీనిపై ప్రత్యేకంగా కూర్చుని చర్చించుకుని సామరస్య పూర్వక పరిష్కారానికి రావాలని చెప్పగా అందుకు సిఎస్ ఆదిత్యానాధ్ అంగీకరించి ఈ సమస్య పరిష్కారానికి ఒక నిర్థిష్ట సమయాన్ని నిర్దేశించాలని కోరారు. వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ, అనంతరాము, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్.రావత్, ఎస్ఆర్‌సి ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.