దురుద్దేశంతోనే కేటీఆర్‌ విశాఖ నినాదం: రేవంత్‌

_తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే మంత్రి కేటీఆర్‌ విశాఖ నినాదం ఇచ్చారని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు._

_విభజన హామీలపై కేంద్రంతో పోరాడటం లేదు కానీ విశాఖ ఉక్కుపై పోరాడతారా అని నిలదీశారు. గురువారం ఈ మేరకు రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు._

_ఎన్నికల సమయంలో హక్కుల కోసం మాట్లాడటం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం తెరాసకు అలవాటైందన్నారు. పెరిగిన నిత్యవసరాలు, గ్యాస్‌, ఇంధన ధరలపై పోరాటానికి తెరాస ముందుకు రావడం లేదని రేవంత్‌ ఆక్షేపించారు. పార్లమెంట్‌లో పోరాడాల్సిన తెరాస ఎంపీలు మొహం చాటేశారని విమర్శించారు._

_ప్రధాని మోదీ అంటే భయపడుతున్నారా? రాజీ పడుతున్నారా? అని ప్రశ్నించారు. భాజపాపై గల్లీలో మాటలకు దిల్లీలో చేతలకు పొంతన కుదరడం లేదని రేవంత్‌ ఆరోపించారు._

_ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బుధవారం తెరాస అభ్యర్థులకు మద్దతుగా నగరంలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు._

_తెలంగాణలోనూ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే పరిస్థితి వస్తే పోరాటానికి వారూ కలిసి రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే._

Leave A Reply

Your email address will not be published.