అమరావతికి రూ. 3వేల కోట్ల రుణం

విజయవాడ: అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, భూ సేకరణ పథకం లేఅవుట్ల అభివృద్ధి పనులకు మొదటి దశలో రూ. 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 3వేల కోట్ల మేర బ్యాంక్ రుణాలు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మొదటి దశలో ప్రాధాన్య క్రమంలో మౌళిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ పథకం కింద చేపట్టాల్సిన పనులకు ఆమోదం లభించింది.

ఏఎం ఆర్డీయే పరిధిలో మౌళిక సదుపాయాల కల్పనకు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు బ్యాంక్ రుణాల కోసం.. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు రూ. వెయ్యి కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు ఏఎం ఆర్డీయే కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఈ రుణంతోపాటు వడ్డీ కూడా అమరావతి మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీనే చెల్లించుకోవాలని షరతుల్లో పేర్కొంది.

అమరావతి అభివృద్ధికి గత చంద్రబాబు ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ. 29.282 కోట్లను తమ ప్రభుత్వం భరించలేదని చెబుతున్న సీఎం జగన్.. ఇప్పుడు ఈ మొత్తాన్ని మూడో వంతుకు తగ్గించారు. ఇందుకు తగినట్టుగా వ్యయాన్ని రూ. 11.098 కోట్లకు కుదిస్తూ ఏఎం ఆర్డీయే కొంతకాలం కిందటే అంచనాలను సవరించింది. ప్రాధాన్య క్రమంలో చేపట్టదగిన అమరావతి ప్రాజెక్టులకు ఇంత మొత్తం చాలని నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ మొత్తంలో రూ. 10వేల కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇస్తే రుణంగా ఇస్తామని మూడు ప్రభుత్వరంగ బ్యాంకులతో కూడిన కన్సార్షియం పేర్కొంది. అయితే ఇంత మొత్తం ఒకేసారి కాకుండా మూడు దశల్లో ఇస్తామని స్పష్టం చేసింది

Leave A Reply

Your email address will not be published.