గ్రేటర్ హైదరాబాద్ పై కమలం ఆశలు
హైదరాబాద్ సిటీ: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయసంకల్ప సభ సక్సెస్‌తో గ్రేటర్ అగ్రనాయకత్వం అసెంబ్లీ నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించడానికి సమాయత్తమవుతోంది. సమావేశాలకు ముందు రెండు రోజులపాటు నియోజకవర్గాల్లో తిరిగిన పార్టీ జాతీయ నాయకులు గెలుపు అవకాశాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని, దీనిని ఓటు బ్యాంక్‌గా మార్చుకోవడానికి ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన వ్యూహాలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్‌లో బీజేపీ బలం పెరిగిందని, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ఆశాభావంతో నాయకత్వం ఉంది. తెలంగాణలో బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ గుండెకాయ. గ్రేటర్‌లో పార్టీ పటిష్ఠంగా ఉంటే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తాయనే భావన అగ్రనేతల్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్‌లో పార్టీ మరింత బలపడిందని వారు భావిస్తున్నారు.
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా..
హైదరాబాద్‌లో కాంగ్రెస్, టీడీపీకి పట్టు లేకపోవడంతో ఇది తమకు మంచి అవకాశంగా బీజేపీ భావిస్తోంది. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో విజయం సాధించడం, టీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో పార్టీ బలంగా ఉన్న డివిజన్లు, నియోజకవర్గాల్లో కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి, పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలను చేపట్టే యోచనలో ఉన్నారు. గ్రేటర్‌లో 47 మంది కార్పొరేటర్లు గెలవడంతో పార్టీ బలపడిందని పరిశీలకులు కూడా భావిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయసంకల్ప సభ సక్సెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో పార్టీని అభివృద్ధి చేయాలనే దిశలో నాయకులు అడుగులు వేస్తున్నారు.
బలం పెంచుకునే దిశగా..
సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌పై పార్టీ ప్రధాన దృష్టి సారించింది. అక్కడి నుంచి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో బలం మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి మెజార్టీ వచ్చింది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పటిష్ఠం అయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
ముషీరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్‌లో చింతల రాంచంద్రారెడ్డి, అంబర్‌పేట సెగ్మెంట్లను కిషన్‌రెడ్డి పర్యవేక్షిస్తుండడంతో ఆ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ సీట్లను కైవసం చేసుకోవచ్చని నాయకులు భావిస్తున్నారు. గతంలో అంబర్‌పేట, ముషీరాబాద్‌లో బీజేపీ గెలిచిన స్థానాలు కావడంతో వచ్చే ఎన్నికల్లో మరింత దృష్టి సారిస్తే విజయం సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు. సనత్‌నగర్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనుకూల వాతావరణం ఉందని పార్టీ భావిస్తోంది. ఈ రెండుచోట్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బలమైన అభ్యర్థిని నిలిపితే కాషాయ జెండా ఎగరవచ్చనుకుంటున్నారు. శేరిలింగంపల్లిలో గతంలో కంటే ప్రస్తుతం పార్టీ పట్టు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
కుత్బుల్లాపూర్‌లోనూ బలపడింది. ఈ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. జగద్గిరిగుట్ట డివిజన్‌లో కూడా పార్టీ బలం పెంచుకుంది. ఎల్బీనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలలో పటిష్ఠంగా ఉంది. పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు ఉన్నారు. మహేశ్వరంలోని బడంగ్‌పేట, మీర్‌పేటలో అత్యధిక స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకోవడంతో ఇక్కడ పార్టీ బలంగా ఉందని నాయకత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ బాగా దృష్టి పెడితే ఈ రెండు అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఖాతాలో జమ చేసుకోవచ్చని పార్టీ అంచనా వేస్తోంది. ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కష్టపడితే మెరుగైన ఫలితాలు వస్తాయని నాయకులు భావిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ అంచనా వేస్తోంది.