నిజాం నవాబుతో యుద్ధం వెనుక మరో యుద్ధం
విదేశాల్లో నిజాం కొనుగోలు ఒప్పందం
ఆపరేషన్‌పోలోకు తెరవెనక యుద్ధం: పోలోకు ముందు తెరవెనక మరో యుద్ధమే జరిగింది. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచడం..లేదంటే పాకిస్థాన్‌లో కలపాలనే ఉద్దేశంతో నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ అనేక ప్రయత్నాలు చేశారు.
బ్రిటిష్ ప్రభుత్వంతో ఉన్నట్లే భారత ప్రభుత్వంతో కూడా యథాతథ స్థితి కొనసాగించేలా ఒప్పందానికి సిద్ధమయ్యాడు. దీంతో బ్రిటిష్ సైన్యాలు హైదరాబాద్‌లో ఉన్నట్టే భారత సైన్యం నగరంలో ఉండేందుకు వీలవుతుంది. దీన్ని మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఇత్తెహద్), రజాకార్ల అధినేత ఖాసిం రజ్వీ వ్యతిరేకించారు. నిజాం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఒక రకంగా నిజాంపై రజ్వీ తిరుగుబాటు చేసినంత పని చేశాడు. దాంతో ఒత్తిడికి తలొగ్గిన నిజాం హైదరాబాద్‌లో భారత సైన్యంఉండకుండా షరతు విధించి 1947 నవంబరు 29న భారత గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్‌తో స్టాండ్‌స్టిల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ప్రకారం ఏడాది పాటు విదేశాంగ, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవహారాల్లో తప్పిస్తే హైదరాబాద్‌పై నిజాంకే పూర్తి అధికారాలుంటాయి.
విదేశాలతో ఆయుధ బేరాలు..
ఒప్పందాన్ని నిజాం వెంటనే ఉల్లంఘించడం మొదలుపెట్టాడు. భారత్‌తో సుదీర్ఘ యుద్ధానికి వ్యూహాలు రచించాడు. భారీస్థాయిలో ఆయుధాలు సమకూర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇలా అన్నీ దేశాలను సంప్రదించడం మొదలుపెట్టాడు. పాక్‌కు రహస్యంగా కోటి యాభై లక్షల పౌండ్ల రుణం ఇచ్చాడు. దీంతో నిజాం తరఫున ఆయుధాలు కొనుగోలుకు పాకిస్థాన్ రంగంలోకి దిగింది. 6లక్షల రైఫిళ్లు, రివాల్వర్లు, 3లక్షల మెషీన్‌గన్‌లు, ఫ్రాన్స్ నుంచి ఆర్డర్ చేసింది. ఇవన్నీ హైదరాబాద్ కోసమనే విషయం కామన్వెల్త్ రిలేషన్స్ ఆఫీస్(సీఆర్‌వో), యూకే విదేశాంగశాఖ ద్వారా లండన్‌లో భారత హైకమిషనర్ కృష్ణమేనన్‌కు తెలిసింది. దీంతో భారత్ దౌత్యపరంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి అడ్డుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఏజెంట్ సిడ్నీకాటన్ ద్వారా ఆయుధాలు సమకూర్చుకోవాలనే ప్రయత్నం చేశాడు. 1948 ఆగస్టుకల్లా కొన్ని ఆధునిక ఆయుధాలు హైదరాబాద్‌కు వచ్చాయి. శిక్షణ ఇచ్చే సమయం కూడా లేకుండా పోయింది. అప్పటికే భారతసైన్యం ఆపరేషన్ పోలోతో ముప్పేట దూసుకురావడంతో నిజాం సైన్యం స్వల్ప ప్రతిఘటనతో లొంగిపోయింది.
విమానం వెనక రజ్వీ పరుగు..
పరిస్థితి చేయిదాటిపోవడంతో సిడ్నీ కాటన్ సెప్టెంబరు 16 తెల్లవారుజామునే హకీంపేట నుంచి రూ.40కోట్ల నగదుతో విమానం ఎక్కేశాడు. ఖాసింరజ్వీ కూడా వెళ్లాల్సింది. అతను ఎక్కాడో లేడో చూసుకోకుండానే కాటన్ విమానం బయల్దేరింది. రజ్వీ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లినా లాభం లేకుండా పోయింది.
నిజాం లొంగుబాటు
ఈనాడు, హైదరాబాద్: దేశంలోని అన్ని ప్రాంతాలు స్వపరిపాలనలో స్వేచ్ఛగా జీవిస్తుంటే.. హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్ల దాష్టీకాల మధ్యే జనం మగ్గారు. వీరి పీడ వదిలించుకునేందుకు ఉద్యమకారులు కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో ఉంటూ వేర్వేరు రూపాల్లో పోరాటం మొదలెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా ఎవరి స్థాయిలో వారు పోరాటం చేశారు. 1947 సెప్టెంబరు నుంచే కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ రైతాంగ పోరాటం తీవ్రమైంది.
బాంబులు విసిరారు..
నిజాంను గద్దె దించాలని ఆచార్య కొండాలక్ష్మణ్‌బాపూజీ, నారాయణరావు పవార్, జంగయ్య, రఘువీర్ తదితరులు కలిసి మహారాష్ట్ర వెళ్లి బాంబులను విసిరేందుకు శిక్షణ తీసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చాక అదను చూసి నిజాం తన కారులో బయటికి రాగానే బాంబులు విసిరారు. ఆ దాడిలో నిజాం తప్పించుకున్నాడు వీరిని జైల్లో వేశారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. కలం వీరుడు షోయబుల్లాఖాన్‌ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. రజాకార్ల ఆగడాలు మితిమీరడం.. రజాకార్ల సంస్థను రద్దు చేయడం కుదరని నిజాం ప్రధాని తెగేసి చెప్పడంతో.. భారత్ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ పోలీసు చర్యకు ఆదేశించారు.
నాలుగువైపుల నుంచి..
సెప్టెంబరు 13న ఆపరేషన్ పోలో మొదలైంది. భారత సైన్యం షోలాపూర్, పుణె, నాగ్‌పూర్ ప్రధాన మార్గంలోని నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ వైపు సాగింది. విజయవాడ నుంచి మరో రైఫిల్స్ దళం వచ్చింది. సూర్యపేట వద్ద భీకర పోరాటం జరిగింది. ఇక్కడి నుంచి సైన్యం హైదరాబాద్ వెళ్లకుండా మూసీ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. రెండు గంటల్లోనే మార్గాన్ని పునరుద్ధరించుకున్న సైన్యం హైదరాబాద్‌కు ప్రయాణమైంది. కర్నూలు వైపు నుంచి నగరంలోకి సైన్యం ప్రవేశించింది. నాలుగు రోజుల్లోనే దాదాపు అన్నివైపుల నుంచి హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. నిజాం ఆత్మరక్షణలో పడిపోయాడు. సెప్టెంబరు 16న నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తూ నిజాం బ్లాక్ అవుట్ ప్రకటించాడు. ఇళ్లలోంచి ఎవరూ బయటికి రాకుండా రజాకార్లు పహారా కాస్తున్నారు. సైరన్ మోగితే చాలు అందరూ ఇళ్లపైకి ఎక్కి విమానాలు వస్తాయని, తమను రక్షిస్తారని చూడసాగారు. ఓటమి అంచుల్లో ఉన్న రజాకార్లు మరింత రెచ్చిపోయే ప్రమాదముందని ప్రజలు ఆ రాత్రంతా బిక్కుబిక్కుంటూ గడిపారు. 17న ఉదయం హైదరాబాద్‌లో పోలీసు చర్య ప్రారంభమైంది. నిజాం దిగి వచ్చి పటేల్ ముందు మోకరిల్లాడు.