lok sabha elections, uttar pradesh elections 2019,BSp samaj party

యూపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారు

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీల మధ్య ఎన్నికల పొత్తు దాదాపు ఖరారయింది.ఈ నెలాఖరు లేదా కొత్త సంవత్సరం ప్రారంభంలో లక్నో సందర్శన సందర్భంగా పార్టీ అధినేత్రి యాయావతి ఈ ఒప్పందానికి తుది మెరుగులు దిద్ద వచ్చని ఆ పార్టీకి చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని నాయకుడొకరు చెప్పారు. రాష్ట్రంలోని మొత్త 80 లోక్‌సభ స్థానాలకుగాను కొన్ని స్థానాల్లో తప మిగతా అన్ని స్థానాల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన ఫార్ములా ఖరారయిందని కూడా ఆ నాయకుడు చెప్పారు. పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మిగతా స్థానాలకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులు సైతం పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.బిఎస్‌పి ఎస్‌పి కూటమిలో తాను కూడా భాగస్వామి కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ ఆ పార్టీ పెద్దన్న ధోరణి కారణంగా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను కూటమికి దూరంగా ఉంచే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ఈ రెండు పార్టీలు కూడా తమ అభిప్రాయం బైటికి చెప్పడం లేదు. అయితే ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ లలో బిఎస్‌పి కొన్ని స్థానిక పార్టీల పొత్తుతో విడిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కలేదు.

కానీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని బిఎస్‌పి ప్రకటించడం తెలిసిందే. అంతేకాకుండా ఆ రాష్ట్రంతో పాటుగా చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు విషయంతో ఈ రెండు పార్టీల వైఖరిలో మార్పు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. యుపిలో తాము ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిన పక్షంలో అందుకు తగ్గ సన్నాహాలను కూడా కాంగ్రెస్ మొదలుపెట్టింది. మాయావతి 63వ జన్మదినం సందర్భంగా బిఎస్‌పి జనవరి 15న భారీ సభను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ తమతో చేతులు కలిపే అవకాశాలున్న పార్టీల నేతలను ఆహ్వానించింది. అయితే వాటిలో కాంగ్రెస్ లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయడానికి మానసికంగా సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజక వర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేయగల సత్తా ఉన్న అభ్యర్థుల వేట మొదలు పెట్టింది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాలను పూర్తి చేశామని యుపి వ్యవహారాల ఇన్‌చార్జి అయిన ఎఐసిసి కార్యదర్శి ప్రకాశ్ జోషీ చెప్పారు. కూటమిలో భాగస్వామిగా ఉండాలా లేదా అనే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, అయితే పార్టీ పరంగా ఒంరిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పారు.బిఎస్‌పిఎస్‌పి కూటమి కాంగ్రెస్ పెద్దగా సీట్లు ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చని, అందువల్ల ఒంటరిగా పోటీ చేయడానికి ప్లాన్ బిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకులు అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోది. పొత్తు విషయమై ఈ రెండు పార్టీలతో దేనితో కూడా కాంగ్రెస్ ఇప్పటివరకు అధికారికంగా చర్చలు జరపనప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి, అమేథి స్థానాలను మాత్రమే బిఎస్‌పి, ఎస్‌పిలు ఆ పార్టీకివదిలిపెట్టవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే పొత్తులపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని కూడా తమ కూటమిలో చేర్చుకుంటే మంచిదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బిఎస్‌పి నాయకుడొకరు అన్నారు. తాము 15 సీట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ 8, 10 స్థానాలకయినా అంగీకరించే అవకాశం లేకపోలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆంతరంగికంగా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ లేని ఏ ప్రతిఓక్ష కూటమి కూడా పూర్తి స్థాయి బిజెపి వ్యతిరేక కూటమి కాబోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఆ పార్టీలు ఏం చేస్తాయో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.
Tags: lok sabha elections, uttar pradesh elections 2019,BSp samaj party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.