Homeopathy, allopathy,ayurveda medicine

భారతీయ సంప్రదాయ వైద్యమైన హోమియోపతి, ఆయుర్వేదo కనుమరుగవుతోందా..?

భారతీయ సంప్రదాయ వైద్యమైన హోమియోపతి, ఆయుర్వేదిక్‌ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. రోగుల నుంచి ఆదరణ ఉంటున్నా వైద్యుల జాడ కానరావడం లేదు. ఏడాదిగా మందుల సరఫరా ఆగిపోయింది. రోగులు ఆస్పత్రులకు వస్తున్నా మందులు లేక వెనుదిరగాల్సి వస్తోంది. ఆయుష్‌ విభాగంలోని లోపాలను సవరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రోగులు ఈ ఆస్పతుల వైపు చూడడమే మానేశారు.

జిల్లాలో ఆయుష్‌ విభాగంలో ప్రభుత్వ, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద కలిపి 86 పోస్టులు ఉన్నాయి. అందులో 29 వరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఆయుష్‌ పరిధిలో ప్రభుత్వ విభాగంలో 42 వైద్యులు పోస్టులు ఉండగా అందులో హోమియోపతి విభాగంలో 12 మంది పనిచేస్తున్నారు. ఆయుర్వేదిక్‌ విభాగంలో 21 పోస్టులకుగాను 7 ఖాళీగా ఉన్నాయి. యునాని విభాగంలో ఉన్న 9 పోస్టులతో కలిపి మొత్తం ఈ మూడు విభాగాల్లో 35 మంది వైద్యులు పనిచేస్తున్నారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు వైద్యుల పోస్టులు 44 వరకు ఉన్నాయి. అందులో ఆయుర్వేదిక్‌ పోస్టులు 22 ఉండగా కేవలం ఐదుగురు పనిచేస్తుండడం గమనార్హం. 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హోమియోపతిలో 13 మందికిగాను 9 మంది పనిచేస్తున్నారు. యునానిలో 6 మందికిగాను ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు. నేచురోపతిలో ముగ్గురు పనిచేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఆయుష్‌ విభాగంలో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీగా ఉండడంతో రోగులకు మెరుగైన సౌకర్యాలు కానరావడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్‌ విభాగంలో వైద్యులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. రోగులను ఆకట్టుకునేలా చర్యలు లేకపోవడంతో భారతీయ సంప్రదాయ వైద్యం అటకెక్కుతోంది. ప్రభుత్వం ఈ విభాగాలపై దృష్టి సారించకపోవడం.. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో రోగుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతోంది. బోధన ఆస్పత్రిలో అన్నిరకాల ఆసుపత్రులు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐదేళ్ల కిందట నగరంలోని పెద్దాస్పత్రిలో ఆయుష్‌ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేదిక్‌ వైద్యాలయాలను ఏర్పాటుచేసింది. మూడేళ్ల కిందటివరకు ఈ రెండింటిలో సీనియర్‌ వైద్యులు ఉండేవారు. ఆ తర్వాత వారు బదిలీ అయ్యారు. చివరికి హోమియోపతి విభాగంలో పనిచేసే వైద్యులు బ్రాహ్మణకొట్కూరు, పోలకల్లుకు మూడు రోజుల చొప్పున డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. మందులు సరఫరా కాకపోవడంతో అరకొరగా ఉన్న వాటినే అందిస్తున్నారు. రోగుల నుంచి మంది ఆదరణ ఉన్నప్పటికీ అవసరమైన మందులు అందడం లేదు. చివరికి అరకొరగా మందులు ఇచ్చి పంపేస్తున్నారు.

ఆయుష్‌ విభాగం ఆసుపత్రులకు గతంలో హైదరాబాద్‌లోని ఆయుష్‌ విభాగం నుంచి మందులు అందజేసేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడినుంచి మందుల సరఫరా ఆగిపోయింది. దీనికితోడు ఆయుష్‌ విభాగానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ ఇవ్వకపోవడంతో వైద్యులు ఉన్నప్పటికీ మందులు లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా ఆయుష్‌ ఆస్పత్రులన్నీ మొక్కుబడిగా నడుస్తున్నాయి. చేతినిండా పనిలేకపోవడంతో వైద్యులు సైతం సమయపాలన పాటించడం లేదు. హోమియోపతి ఆసుపత్రులకు దాతల ఆర్థికసాయంతో రోగులకు కొంతమేర మందులు అందజేస్తున్నారు. యునాని, ఆయుర్వేదిక్‌ మందులు మాత్రం సరఫరా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి.
Tags: Homeopathy, allopathy,ayurveda medicine