chandrayaan2 ,story mamidikalva, madhusudhan, mission success

చంద్రుడికో ఇస్రో పోగు

కిరణజన్య సంయోగ క్రియతో చెట్ల ఆకులు పత్రహరితాన్ని తయారుచేసుకున్నట్లే , చంద్రుడి వెన్నెల ధాన్యానికి ఔషధ గుణాన్ని పంచుతుంది . పౌర్ణమికి సముద్రం పొంగుతుంది . మనసుకు చంద్రుడు అధిపతి. అమృతం కోసం పాలసముద్రంలో మంథర పర్వతాన్ని చిలుకుతుంటే ముందు చంద్రుడు వచ్చాడు . తరువాత మహాలక్ష్మి పుట్టింది . లోకానికి లక్ష్మీదేవి అమ్మ . అమ్మ అన్నకాబట్టి చంద్రుడు మనకు మేనమామ – చందమామ అయ్యాడు . అంటే చంద్రుడు మనకు చాలా దగ్గరిబంధువు . ఇలా చంద్రుడి ప్రస్తావన మనకు అడుగడుగునా ఉంది .

కానీ అతడి గ్రహచారం కొద్దీ మనకు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు . అమ్మతరపు చుట్టాన్ని చుట్టపుచూపుగాఅయినా ఒకసారి చూసిరాకుంటే ఎలా అని మనసంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇస్రో చంద్రయాన్ మొదలుపెట్టింది . శరత్చంద్రికలో శ్రీ శ్రీ చెప్పనే చెప్పాడు – ఏదో ఒకరోజు రెక్కలుకట్టుకుని చంద్రుడిని పలకరించడానికి వెళ్తామని .

ఎన్నో దశలు , ఎంతో సాంకేతికత , ఎంతో పరిశోధన , ఎందరో శాస్త్రవేత్తల తపస్సు . 3 లక్షల 84 వేల కిలో మీటర్ల ప్రయాణం అంతా అనుకున్నట్లే జరిగింది . చివరి రెండు కిలోమీటర్లు దిగితే చంద్రుడిపై ‘విక్రమ’పాదం మోపేవాళ్ళం . ఆ దశలో దానికదే ఆదేశాలు ఇచ్చుకుని దిగాల్సిన స్వయం నియంత్రిత విక్రమ్ ఏ కుదుపుకు గురయ్యిందో – సంబంధాలు తెగిపోయాయి . చంద్రుడిపై దిగినట్లా ? దిగనట్లా ? తెలియని అయోమయంలో ఉన్నాం . కానీ ఈ ప్రయత్నం , ఈ ప్రయాణం మానవేతిహాసంలో ఆషామాషీ కాదు . అమ్మపుట్టిల్లు మేనమామకు తెలియదా ? తెగిన సంబంధాలను చందమామే చల్లని వెన్నెలచూపుతో పునరుద్దరించకపోడు . కల్పిత గాథల ఊహకు కూడా అందని ఇంతటి ప్రయాణాన్ని ఒక అడుగు దూరందాకా సుసాధ్యం చేసిన శాస్త్రవేత్తలందరికీ జేజేలు .

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply