month 26 and 27

26, 27 తేదీల్లో బ్యాంకుల సమ్మె!!

ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా కన్సాలిడేట్‌ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు బ్యాంకు అధికారుల సంఘాలు హెచ్చరించాయి. బ్యాంకు అధికారుల సంఘాలు అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌ (ఇన్‌బాక్‌), బ్యాంకు అధికారుల జాతీయ సంఘటన (నోబో) ఈ మేరకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌కు ఉమ్మడిగా నోటీసు పంపాయి.. ఆంధ్రాబ్యాంకు సహా దేశంలోని 10 పెద్ద బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చనున్నట్టు ప్రభుత్వం గత నెల 30న ప్రకటించింది.

తమ డిమాండ్లకు మద్దతుగా నవంబరు రెండో వారం నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని యూనియన్‌ నాయకుడొకరు హెచ్చరించారు.బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలను తక్షణం పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, నగదు లావాదేవీల వ్యవధిని తగ్గించాలని, నియంత్రిత పని గంటలు కూడా అమలు పరచాలని ఆ సంఘాలు కోరుతున్నాయి.

ఇవి కాకుండా విజిలెన్స్‌ కేసులకు సంబంధించిన విధివిధానాల్లో వెలుపలి ఏజెన్సీల అనవసర జోక్యాన్ని నివారించాలని, రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, తగినంత మంది సిబ్బందిని నియమించాలని, ఎన్‌పిఎస్‌ రద్దు చేయాలని, వినియోగదారులకు సర్వీసు చార్జీలు రద్దు చేయాలని, పని తీరు బాగుండలేదన్న సాకుతో అధికారులను వేధించడం మానుకోవాలని కూడా వారు కోరుతున్నారు. ఈ డిమాండ్లకు మద్దతుగా ఈ నెల 25 అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు సమ్మె చేయనున్నట్టు ఆ సంఘాలు ప్రకటించాయి.

Leave a Reply