AP IT minister lokesh in top league

ఇది జోక్ కాదు: అత్యంత ప్రభావశీల నేతగా లోకేష్!

ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన యువనేతల్లో మొదటి ఇరవై స్థానాల్లో ఏపీమంత్రి లోకేష్ కు స్థానం దక్కిందట! ఈమాట చెబితే ఎవరైనా నవ్వుకుంటారేమో.. ఎందుకంటే ఇది జోక్ కాదు. సీరియస్ గా ఈ విషయాన్ని ప్రకటించారు. అదేదో అధ్యయన సంస్థ అట. దానిపేరు ఇదివరకూ వీరాధివీర జర్నలిస్టులు కూడా విని ఉండరు. దాని పుట్టుపూర్వోత్తరాలు ఏ కులపోళ్లతో ముడిపడి ఉన్నాయో కానీ… లోకేష్ ను అత్యంత ప్రభావవంతమైన యువనేతగా ప్రకటించేశారు! అయినా ఏ ప్రాతిపదికన లోకేష్ ను అత్యంత ప్రభావవంతమైన నేతగా ఎంపిక చేశారో. ప్రజల నుంచి ఎన్నిక కాకుండా.. నామినేటెడ్ పోస్టుతో మంత్రిపదవిని తీసుకున్నందుకా! తండ్రి ముఖ్యమంత్రి కావడం వల్ల  మాత్రమే మంత్రి అయినందు వల్లనా!

పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా.. పంచాయతీ ఎన్నికల్లో నెగ్గకుండానే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేస్తున్నందుకు లోకేష్ ను అత్యంత ప్రభావశీల నేతగా ప్రకటించేశారా. లేక ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ కంట్రీ.. అన్నందుకా, అంబేద్కర్ జయంతిని కాస్తా వర్ధంతిని చేసినందుకా.. తాము ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడుతున్నామని ఇటీవలే సెలవిచ్చినందుకా. విభజన నాడు ప్రధానమంత్రి మోడీ అని చెప్పినందుకా.. ఇవన్నీగాక కులపిచ్చి, మతపిచ్చి, బంధుప్రీతి.. ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అని సగర్వంగా ప్రకటించుకున్నందుకా లేక సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీకు మీరు ఉరేసుకున్నట్టే అని ప్రజానీకానికి చెప్పినందుకా! ఇన్ని ఘనతలున్నాయి మరి లోకేష్ ఖాతాలో. వీటిలో దేనికి మెచ్చి లోకేష్ ను అత్యంత ప్రభావశీల యువనేతగా ప్రకటించారో కూడా చెప్పి ఉంటే బాగుండేది! అలాగే ఈ జాబితాలో లోకేష్ సరసన స్థానం సంపాదించిన మహానుభావులు ఎవరెవరో కూడా ప్రకటించి ఉంటే.. మరింత స్పష్టత వచ్చేది!