రోజుకు 2500 బస్సులు అదనం

విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు అదనంగా 100..
ఆర్టీసీ సంక్రాంతి ఏర్పాట్లు

ఆర్టీసీకి ఆదాయం తీసుకొచ్చే సీజన్లలో సంక్రాంతి ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా ‘పెద్ద పండక్కి’ సొంతూరు వెళ్తారు. వాళ్ల రవాణా అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. రోజువారీ సర్వీసులకు అదనంగా బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌ నగరం నుంచే ఆంధ్ర, రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు వేశారు. ఈ నెల 12నుంచి అదనపు బస్సులు మొదలవుతాయి. రోజుకి 2500 బస్సులు అదనంగా రోడ్డెక్కుతాయి. ఇందులో 700 బస్సులు ఒక్క హైదరాబాద్‌ నుంచే ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనున్నాయి. అటు ఉత్తరాంధ్ర నుంచైనా, ఇటు సీమ నుంచైనా ఎక్కువ మంది హైదరాబాద్‌, ఆ నగర శివార్లలోనే నివసిస్తున్నారు. వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ జయరావు తెలిపారు.
హైదరాబాద్‌కు ఆర్టీసీ అధికారులు
అదనపు సర్వీసులు ఇబ్బంది లేకుండా నడిపేందుకు, ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కొందరు అధికారుల్నీ, ఉద్యోగుల్నీ హైదరాబాద్‌కు పంపించారు. విజయవాడ ప్రాంతం రాజధానిగా మారిన తరవాత వివిధ ప్రాంతాలవారూ ఇక్కడకు వచ్చారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని విద్యాసంస్థలో బయటి ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొనే విద్యార్థులు ఎక్కువే. వీరి అవసరాలకు అనుగుణంగా ఈ రెండు నగరాల నుంచీ ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు ప్రతిరోజు 100 అదనపు సర్వీసులు వేశారు. విజయవాడ ప్రధాన బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌లు కేటాయింపులో ప్రయాణీకులకు ఎలాంటి గందరగోళం లేకుండా చేయడంతోపాటు వారికి స్పష్టమైన సమాచారం చేరవేసే విధానంపై ఇప్పటికే ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. బస్సు సర్వీస్‌ స్పష్టంగా కనిపించేందుకు బస్సుకి నాలుగు వైపులా పెద్ద అంకెలతో స్టిక్కర్లు అతింకించనున్నారు. అలాగే అదనపు బస్సుల సామర్థ్యం(కండిషన్‌) పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఆదేశించారు.

హైదరాబాద్‌ నుంచి కాస్త ఆలస్యంగానే..
హైదరాబాద్‌లో మెట్రో పనులు కొనసాగుతున్న దృష్ట్యా అక్కడనుంచి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో బస్సులు నడవడంలో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఎల్‌బీ నగర్‌లో జరుగుతున్న పనుల వల్ల ఎక్కువ ఆలస్యమవుతోందని ఇప్పటికే డ్రైవర్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట ప్రాంతాల్లోనూ రద్దీ సమస్య ఉంది. రిజర్వేషన్‌ చేయించుకొన్నవారి మొబైల్‌ ఫోన్లకు బస్సు బయలుదేరే సమయాన్ని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తారు. స్మార్ట్‌ఫోన్లో ఆర్టీసీ యాప్‌ ఉంటే జీపీఎస్‌ ద్వారా బస్‌ను ట్రాక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

తిరుగు ప్రయాణానికీ ఏర్పాట్లు
సంక్రాంతి ముగిసిన తరవాత స్వస్థలాల నుంచి హైదరాబాద్‌కీ, తమ నివాస ప్రాంతాలకు వెళ్లేవారికీ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 16వ తేదీ సాయంత్రం నుంచి ఆంధ్ర, సీమ జిల్లాల నుంచి అదనపు సర్వీసులుంటాయి. అధికారులు ఆమేరకు తిరుగు ప్రయాణానికి తగిన చర్యలు తీసుకొన్నారు.