విధికే సవాల్‌.. ఈ ఉమ!

‘ర్రే తొందరగా కంపోజిషన్‌ పూర్తిచెయ్‌.. అక్కడ ప్రిన్స్‌పాల్‌ మేడమ్‌ చూస్తున్నారు!’ – ఇలా చెప్పుకుంటారు అక్కడి విద్యార్థులు తమలో తాము. ‘పీరియడ్‌ పూర్తికాకుండా క్లాసు నుంచి బయటకొస్తే.. మేడమ్‌కి నచ్చదు!’ – కొత్తగా చేరే ఉపాధ్యాయులకి ఆ బడి సీనియర్‌లిచ్చే సూచన ఇది. ఈ చెప్పడమంతా ఆమెపట్ల భయంతో కాదు.. గౌరవంతో! ఇంకా చెప్పాలంటే ప్రేమతో!! ఇంతకీ వీళ్లనంతా ఆమె గమనిస్తుండేది బడిలోని తన ఛాంబర్‌ నుంచి కాదు. తన ఇంట్లోని పడకపై నుంచి. ఒకట్రెండు కాదు.. పదేళ్లుగా ఆమె ఇలాగే తన వందల మంది విద్యార్థుల బాగోగులు చూసుకుంటున్నారు. ఎందుకలా?
కుటుంబంలో ఉన్నదిప్పుడు ఒకే ఒక వ్యక్తి.. ఉమాశర్మ. భర్తా, ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని.. నెత్తిన కన్నీటికుండను మోస్తూ మోస్తూ.. ఓ రోజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. పైకి లేవలేదు. కాళ్లు చచ్చుపడిపోయాయి. శరీరం స్పర్శ కోల్పోయింది. కేవలం తల, చేతులే పనిచేస్తున్నాయి. ఆ క్షణంలో ఆమె కళ్ల ముందు 550 మంది పిల్లలు మెదిలారు. ‘మేడమ్‌.. మేడమ్‌..’ అంటూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్నారు. వాళ్లు వీధిన పడకూడదంటే.. ‘నేను ఎలాగైనా బతికితీరాలి.. మళ్లీ నిలదొక్కుకోవాలి. పాఠశాల ఆగకూడదు..’ తనకు తాను సంకల్పం చెప్పుకున్నారు. విధికి సవాలు విసిరారు. పక్షవాతంతో పదేళ్ల నుంచి మంచానపడినా సరే.. ట్యాబ్‌, ఫోన్లతోనే పాఠశాలను సవ్యంగా నడిపిస్తున్న ఆమె.. ఉత్తరప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లోని నేషనల్‌ పబ్లిక్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌. ‘విద్యార్థులకే కాదు, మీరెంతో మంది మహిళలకు స్ఫూర్తి మేడమ్‌’ అనగానే నవ్వారు. విధితో పోరాడి గెలిచిన తన జీవితాన్ని ‘వసుంధర¹’తో పంచుకున్నారు..

భర్తను కోల్పోయి..
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్‌. హరియాణా, ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోని పట్టణం. సారవంతమైన భూములున్న ప్రాంతం. బాస్మతీ బియ్యం, పండ్లూ, కొయ్యబొమ్మలూ, వస్త్రపరిశ్రమ, చక్కెర కర్మాగారాలకు ప్రసిద్ధి. ఎక్కడెక్కడి నుంచో వలసకూలీలు ఇక్కడికొచ్చి ఉపాధి పొందుతుంటారు. పిల్లలు బడికి వెళ్లాలంటే ఖరీదైన వ్యవహారం. పాఠశాలల్లో ఫీజులు ఎక్కువ. ఆ లోటును తీర్చి.. పేదపిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నారు ఉమాశర్మ. నేషనల్‌ పబ్లిక్‌స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ‘‘1991లో నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఇక్కడితోనే నా జీవితం ముగిసిపోకూడదనుకున్నా. మరుసటి ఏడాదే పాఠశాలను స్థాపించాను. మాది పేద పిల్లల బడి. మిగిలిన స్కూళ్లతో పోలిస్తే మూడోవంతు ఫీజునే వసూలు చేస్తాం’ అన్నారామె. అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేసే పాతికమంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకున్నారు. చూస్తుండగానే విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ‘ఇప్పుడు మా విద్యార్థుల సంఖ్య 550. ఇందులో సగానికి పైగా పేదపిల్లలే చదువుతున్నారు. ఇక్కడ ఎనిమిదో తరగతి వరకే చదివే అవకాశం ఉంది’ అన్నారు ఉమాశర్మ. స్కూలు ప్రిన్సిపాల్‌üగా విధులు నిర్వర్తిస్తూ.. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య.. భర్త పోయిన చేదు జ్ఞాపకాల నుంచి తేరుకున్నారామె.