రూ.3 లక్షలా.. రూ.5 లక్షలా

మధ్య తరగతికి ఈ బడ్జెట్లో గొప్ప ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇది చివరి సాధారణ బడ్జెట్‌ కానుండడం ఇందుకు నేపథ్యం. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును; పన్ను శ్లాబులను పెంచే దిశగా ఆర్థిక శాఖ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2018-19 బడ్జెట్‌లో ప్రస్తుత రూ.2.5 లక్షల వార్షిక పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు కాకపోయినా.. కనీసం రూ.3 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. మధ్యాదాయ వర్గాలకు ఊరటనివ్వడం కోసం పన్ను శ్లాబులను సైతం మెరుగుపరచే దిశగా ఆ శాఖ పనిచేస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రభావం పడుతున్న వేతన జీవుల కోసం ఆ చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పన్ను శ్లాబులలో మార్పులు చేయనప్పటికీ.. తక్కువ పన్ను చెల్లింపుదార్లకు ఊరటనిచ్చారు. రూ.2.5-5 లక్షల మధ్య వార్షికాదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
రూ.10-20 లక్షల ఆదాయ వర్గాల కోసం..: వచ్చే నెల 1న ప్రకటించే తదుపరి బడ్జెట్లో రూ.5-10 లక్షల ఆదాయ వర్గాలకు 10%; రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు 20%; రూ.20 లక్షల పైబడిన వారికి 30 శాతంగా పన్ను రేట్లను విధించొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు ఎటువంటి శ్లాబు లేదు. ‘ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని; ఇతర ఆదాయ శ్లాబులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల్లో గరిష్ఠ పన్ను రేటుకు సంబంధించిన ఆదాయం చాలా ఎక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాల’ని పరిశ్రమ సంఘం సీఐఐ తన ముందస్తు బడ్జెట్‌ మెమొరాండంలో పేర్కొంది.

25 శాతానికి ఒప్పుకోకపోవచ్చు: పరిశ్రమ సంఘాలు గరిష్ఠ పన్ను రేటును 25 శాతానికి తగ్గించాలని కోరుతున్నప్పటికీ.. అలా జరగకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ద్రవ్యలోటుపై ఉన్న విపరీతమైన ఒత్తిడి ఇందుకు కారణం. జులై 1న జీఎస్‌టీ అమలు తర్వాత పరోక్ష పన్ను వసూళ్లు స్తబ్దుగా మారాయి. దీంతో 2017-18లో ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి పరిమితం చేయడం కష్టతరమవుతోంది. లోటును పూడ్చడం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం అదనంగా రూ.50,000 కోట్లకు పెంచింది.

స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రవేశపెట్టాలి..
పెద్ద నోట్ల రద్దు ప్రభావం మరికొద్ది నెలల పాటు కొనసాగవచ్చని.. కాబట్టి గిరాకీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఫిక్కీ అంటోంది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శ్లాబుల సవరణను ప్రభుత్వం పరిశీలించాలని.. గరిష్ఠ పన్ను రేటు వర్తించే ఆదాయ స్థాయిని మరింత పెంచాలని అంటోంది. ‘దీని వల్ల కొనుగోలు శక్తి మెరుగువుతుంది. అదనపు గిరాకీ వస్తుంది. రూ.20 లక్షలు పైబడితేనే 30 శాతం పన్ను రేటును వర్తింపజేయాలి. అదనంగా వ్యాపార కార్యకలాపాలు, విస్తరణకు అందుబాటు ధరలో రుణాలు లభ్యం కావాలంటే వడ్డీ రేట్లను తగ్గించాల’ని కోరింది. ‘వేతన ఉద్యోగులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలి. రూ.లక్ష వరకు అవకాశం ఇవ్వాలి. అపుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంద’ని అభిప్రాయపడింది. పన్ను వర్తించే ఆదాయంపై చేసే ప్రామాణిక మినహాయింపు(స్టాండర్డ్‌ డిడక్షన్‌)ను 2006-07 మదింపు సంవత్సరం నుంచి రద్దు చేసిన సంగతి తెలిసిందే.

తక్కువ జీడీపీతో.. ద్రవ్యలోటు లక్ష్యం క్లిష్టం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందన్న అంచనాలను చూస్తే ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరడం క్లిష్టతరం కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017-18 బడ్జెట్‌లో జీడీపీలో ద్రవ్యలోటును 3.2 శాతానికి లేదా రూ.5.465 లక్షల కోట్లకు పరిమితం చేయాలని నిర్దేశించుకున్నారు. సాధారణ జీడీపీ వృద్ధి 11.8 శాతంగా ఉంటుందన్న అంచనాలను ఇందుకు ఆధారంగా చేసుకన్నారు. అయితే సాధారణ జీడీపీ 9.5 శాతానికే పరిమితం కానుందని ఇటీవల కేంద్ర గణక కార్యాలయం విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఓ వైపు పన్ను వసూళ్లు తగ్గడం, మరో వైపు తక్కువ జీడీపీ అంచనాలతో ద్రవ్యలోటు శాతం వారీగా పెరుగుతోంది.