అమరావతికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 27న అమరావతికి రానున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఆయన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయానికి వెళ్లనున్నారు. విశ్వవిద్యాలయంలో జరగనున్న ఇండియన్‌ ఎకనామిక్స్‌ అసోసియేషన్‌ సదస్సుల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి సచివాలయానికి వెళతారు. అక్కడే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఫైబర్‌గ్రిడ్‌ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. వినియోగదారులతో రాష్ట్రపతి సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత సచివాలయంలో ఒకటో బ్లాక్‌లో ఏర్పాటు చేసిన రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ పనితీరును రాష్ట్రపతి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతికి వివరించనున్నారు.

రాష్ట్రపతి రాక సందర్భంగా తీసుకోవాల్సి భద్రతా చర్యలు, ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ డీజీపీ సాంబశివరావుతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి (పొలిటికల్‌) శ్రీకాంత్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.