ఆటోస్టార్టర్లు తొలగించాలి

విద్యుత్తు ఆదా కోసం కాదు..
భూగర్భ జలాలు కాపాడేందుకే
పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి రూ.42 వేల కోట్లు
తెలంగాణను విద్యుత్తు మిగులు రాష్ట్రంగా మార్చటమే లక్ష్యం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన
‘వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరాను ప్రారంభించాం. దశాబ్దాలుగా కరెంటు కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురు. వ్యవసాయ మోటార్లకు అమర్చిన ఆటోస్టార్టర్లను రైతులు తొలగించాలి. విద్యుత్తును ఆదా చేసేందుకు ఇలా కోరటం లేదు. భూగర్భ జలాల్ని కాపాడుకునేందుకే వీటి తొలగింపు అనివార్యమని విన్నవిస్తున్నా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం 24 గంటల విద్యుత్తు సరఫరాపై ఆయన ప్రకటన చేశారు. ‘రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. 25 శాతం విద్యుత్తు వీటి ద్వారానే వినియోగం అవుతోంది. వచ్చే రబీ నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు నిరంతర విద్యుత్తు సరఫరాను అమలు చేసేందుకు విద్యుత్తు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 9,500 మెగావాట్ల గరిష్ఠ డిమాండు ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు కూడా కోత విధించలేదు. 198 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు సరఫరా చేశాం. 11 వేల మెగావాట్ల డిమాండ్‌ వరకు
సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉన్నాం’ అని కేసీఆర్‌ తెలిపారు.
తొలినాళ్లలో సంక్షోభం: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్తు సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో పరిశ్రమల ఏర్పాటుకు భయపడే వాతావరణం ఉండేది. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక పంటనష్టం రైతులను ఆర్థికంగా కుంగదీసేది. మునుపటి పాలకులు అవలంబించిన నిర్లక్ష్య వైఖరి, ప్రణాళికా లోపంతో అన్ని రంగాల్లో గాడాంధకారం అలముకుంది. సభలో ఈ ప్రకటన చదువుతున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా అమలవుతోంది. విద్యుత్తు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సుమారు రూ.94 వేల కోట్ల వ్యయంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు ఉంటే ఈ మూడేళ్లలో మరో 7,981 మెగావాట్లను సమకూర్చుకున్నాం. 28 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యంతో తెలంగాణను మిగులు రాష్ట్రంగా మార్చాలన్నదే లక్ష్యం. కొత్త సౌర విద్యుత్తు విధానాన్ని రూపొందించడంతో 2,792 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.
బలోపేతానికి రూ.42 వేల కోట్లు: ‘రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు వచ్చే మూడు, నాలుగేళ్లలో రూ.42 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాం. 400 కేవీ సబ్‌స్టేషన్లు 18, 220 కేవీ సబ్‌స్టేషన్లు 34, 132 కేవీ సబ్‌స్టేషన్లు 90, 33/11 కేవీ సబ్‌స్టేషన్లను 937 నిర్మించనున్నాం. పంపిణీ లైన్లను కూడా భారీగా విస్తరించాం. రాష్ట్రం చూపిన చొరవతో ఉత్తర-దక్షిణ గ్రిడ్ల మధ్య కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. దేశంలో ఎక్కడి నుంచైనా కావాల్సిన విద్యుత్తు పొందేందుకు తెలంగాణకు మార్గం సుగమమైంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి విద్యుత్తు వినియోగం 1,200 యూనిట్లు. ప్రస్తుతం 1,505 యూనిట్లు. జాతీయ సగటు కన్నా అధికం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిపాలకులు: ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలకన్నా రోగుల సంఖ్య అధికంగా ఉంటోంది. సామర్ధ్యానికి మించి రోగులు వస్తున్నా తిప్పిపంపడం లేదు. మానవతా దృక్పథంతో వైద్యులు సేవలు అందిస్తున్నారు’ అని ప్రభుత్వ వైద్యులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యసౌకర్యాలపై ఎమ్మెల్యే జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నకు ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి సమాధానం చెప్పిన తర్వాత సీఎం మాట్లాడుతూ ఆస్పత్రి కిటికీకి సెలైన్‌ బాటిల్‌ కట్టిన చిత్రాన్ని ఓ పత్రికలో ప్రచురించారనీ, రోగులు భారీగా వస్తే ఏం చేయాలన్నారు. అదే విషయాన్ని పత్రికా యాజమాన్యంతో మాట్లాడానన్నారు. సానుకూలంగా చూడాలనీ, ప్రతి అంశాన్నీ విమర్శించటం సబబుకాదన్నారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం పరిపాలకులను నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.