నిర్లక్ష్యమే నిండా ముంచింది!

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చిక్కులపై 29 ఏళ్ల కిందటే హెచ్చరించిన వరంగల్‌ ఎన్‌ఐటీ
చర్యలు తీసుకోకుంటే అథోగతి తప్పదని తేల్చిన కమిటీ
తరువాత లీ సంస్థ కూడా ట్రాఫిక్‌ ఇబ్బందులపై నివేదిక
ఈ రెండింటినీ పట్టించుకోని పాలకులు
వాహనదారులకు అదే శాపం
‘కర్ణుడి చావుకు కారణాలు వెయ్యి’ అన్నట్టు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు సవాలక్ష కారణాలున్నాయి. ట్రాఫిక్‌ చిక్కుముడులు విప్పేందుకు నిపుణులు రూపొందించిన ఈ రెండు నివేదికలు బుట్టదాఖలు చేయడం అందులో ప్రధానమైనది. నిజానికి హైదరాబాద్‌ నగరంలో తొమ్మిది వేల కిలో మీటర్ల విస్తీర్ణంలో రహదారులున్నాయి. వీటిపై ప్రస్తుతం 50 లక్షల వాహనాలు తిరుగుతున్నట్టు అంచనా. పెరిగిపోతున్న జనాభా, వాహనాలతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో 1987లోనే అప్పటి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఆర్టీసీ, హుడా సంయుక్తంగా.. సర్వే చేసి నివేదికను ఇచ్చే బాధ్యతను నాటి వరంగల్‌ రీజినల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు అప్పగించాయి. ప్రొఫెసర్‌ రాఘవాచారి నేతృత్వంలోని ఇంజినీర్ల కమిటీ ఏడాదిపాటు సర్వేలు చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇచ్చే 30 ఏళ్లలో రాజధానిలో ట్రాఫిక్‌ తీవ్ర సమస్యలు సృష్టించబోతోందని ఆందోళన వ్యక్తం చేసిన నాటి కమిటీ..దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలనూ నివేదికలో పొందుపరిచింది.
అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుతో పరిష్కారం
రామచంద్రాపురం, మేడ్చల్‌, ఘటúకేసర్‌, రాజేంద్రనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆ కమిటీ సూచించింది. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది. మూసీ నదిలో అయిదు వంతెనల నిర్మాణం సహా..ఏయే కారిడార్లను అభివృద్ధి చేయాలి? ఉన్న రోడ్లను ఎలా విస్తరించాలన్నది ఈ నివేదికలో స్పష్టంచేసింది. వీటన్నింటికి రూ.1040 కోట్ల వ్యయం అవుతుందని అప్పట్లో కమిటీ సభ్యులు అంచనా వేశారు.