ఎన్నారై సంబంధాలా.. తొందరపడితే అగచాట్లే

ఆరా తీశాకే.. అడుగేయండి..
సమగ్ర సమాచారంతో సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌
‘‘బేగంపేటలో నివాసముంటున్న మహాలక్ష్మి (పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన వరంగల్‌ జిల్లా వాసి రమేష్‌ను పదకొండునెలల క్రితం పెళ్లి చేసుకుంది. పెళ్లప్పుడు కట్నంగా రూ.కోటి నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌లో ఉంటున్న రమేష్‌ తల్లిదండ్రుల కోసం ఒక బెంజ్‌కారును మహాలక్ష్మి తల్లిదండ్రులు ఇచ్చారు. పెళ్లయ్యాక మహాలక్ష్మి ఆస్ట్రేలియా వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత రమేష్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయ్యింది.. మరో ఆస్ట్రేలియన్‌ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కేవలం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా అడిగేసరికి… హైదరాబాద్‌ తీసుకువచ్చి వదిలేశాడు. రమేష్‌ తల్లిదండ్రులను ప్రశ్నిస్తే.. తమకేం సంబంధం లేదని చెప్పారు. పోలీసులను ఆశ్రయించేలోపు అప్రమత్తమై ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్‌కు తాఖీదు పంపారు.’’
– నగరంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రవాస భారతీయ పెళ్లి సంబంధం తాలూకు మోసమిది. ఇదేకాదు ఈ తరహా బాధితులు నగరంలో చాలామంది ఉన్నారు. కుమార్తెలు సుఖపడతారన్న భావనతో తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడిన వారికిచ్చి పెళ్లిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అందరూ మోసగాళ్లు కాకపోయినా… దేశంలోని మెట్రో నగరాల్లో ఇలా మోసపోయి పోలీసులు ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రవాస భారతీయ అబ్బాయిలకు ఇక్కడి అమ్మాయిలను ఇచ్చి వివాహం చేయాలనుకొనేవారు అన్ని వివరాలు క్షుణ్నంగా తెలుసుకున్నాకే ముందుకు వెళ్లాలని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

రెండు మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో…
దేశవ్యాప్తంగా ఐదారేళ్ల నుంచి ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. కొందరు బాధితులు నేరుగా కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు తమ ఆవేదనను వివరిస్తున్నారు. మరికొందరు ట్విట్టర్‌ ద్వారా పంపుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నారై వివాహాలు… చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేంద్ర మహిళా,శిశుసంక్షేమశాఖ, విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ పోర్టల్‌ను రూపొందిస్తున్నాయి. పెళ్లికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెళ్లయ్యాక భారత్‌లోనే వదిలేస్తే సంప్రదించాల్సిన ప్రభుత్వ ఆధికారులు, విదేశాల్లో చిత్ర హింసలు పెడితే ఫిర్యాదు చేసేందుకు సహాయ పడే సంస్థల వివరాలన్నీ ఇందులో ఉండనున్నాయి.
అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు.. తమ అబ్బాయిలకు ఇక్కడి అమ్మాయిలతో పెళ్లి చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం కొందరు స్వయంగా వస్తుండగా.. మరికొందరు అంతర్జాల వివాహ వేదికలను ఆశ్రయిస్తున్నారు.
*వీరిలో 40 శాతం వరకు పెళ్లికొడుకుల తల్లిదండ్రులు అధికంగా కట్నం ఆశిస్తున్నారు.
*20 శాతం పెళ్లికొడుకులు వివాహం తర్వాత భార్యను ఇక్కడ వదిలేసి వెళ్లడం లేదా… అదనపు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.
*చదువుకున్న యువతులనైతే విదేశాలకు తీసుకెళ్లాక వారితో ఉద్యోగాలు చేయించి జీతం మొత్తాన్ని తీసుకొంటున్నారు.
*మరికొందరు యువకులు పెళ్లిళ్లు చేసుకుని ఇళ్లలో చాకిరీ చేయించేందుకు తీసుకెళ్తున్నారు. భార్యకు సరైన భోజనాన్నీ పెట్టడం లేదు. తల్లిదండ్రులకు వారి బాధలను వివరించినా పాస్‌పోర్టు భర్తవద్దే ఉండడంతో తిరిగి వచ్చేందుకు వీల్లేని పరిస్థితులు ఉంటున్నాయి.
*విదేశాల్లో ఉంటున్న వారిపై కేసులు నమోదు చేసినా అంతగా ఉపయోగం లేకపోవడంతో నిందితులు దర్జాగా అక్కడే ఉంటున్నారు. దీంతోపాటు అదనపు కట్నం, ఐపీసీ 498ఏ విదేశాల్లో వర్తించకపోవడం నేరస్థులకు వరంగా మారింది.
*నాలుగైదేళ్లుగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నారై అల్లుళ్ల మోసాలు పెరుగుతున్నాయి. బాధితులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.