రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌లోకి

రాజకీయ పునరేకీకరణకే తెదేపాను వదులుకున్నా
కేసీఆర్‌ కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం
ఆరు దశాబ్దాల కల నిజంచేసిన సోనియాగాంధీ
‘ఆత్మీయుల మాట-ముచ్చట’లో రేవంత్‌రెడ్డి
నేడు రాహుల్‌ సమక్షంలో చేరిక
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ అవసరమన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ‘ఆత్మీయుల మాట-ముచ్చట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవితోపాటు కాంగ్రెస్‌లో చేరనున్న తెదేపా, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘లక్షలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్న నేను రాజకీయ పునరేకీకరణ కోసం.. అభిమానించే నాయకుడిని, పార్టీని, పదవులను వదులుకున్నా. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు నేను ఆ పార్టీలో చేరలేదు. పదేళ్ల క్రితం ప్రతిపక్షమైన తెదేపాలో చేరాను. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం దోపిడి సాగిస్తోంది. దీనికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయానికి తెలంగాణ సమాజం మద్దతివ్వాలి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కలను నిజం చేశారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను కేసీఆర్‌ విస్మరించారు. ఇంటికో ఉద్యోగం ఏ కాకి ఎత్తుకెళ్లింది? తెరాస ఎన్నికల ప్రణాళికలోని ఏ హామీనీ అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చాక పది ఎకరాల గడిలో బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలతో నిర్మాణాలు చేశారు. రాష్ట్రంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్రంలో రాహుల్‌, సోనియాగాంధీల నేతృత్వంలో పనిచేయాలని చెబుతూనే ‘జై కాంగ్రెస్‌’ అంటూ రేవంత్‌రెడ్డి నినదించారు. మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, ఇతర నాయకులు రాజారాం యాదవ్‌, సతీష్‌ మాదిగ, జ్ఞానేశ్వర్‌, జడ్పీటీసీ సభ్యులు సిహెచ్‌.సత్యనారాయణరెడ్డి, ఎం.సురేందర్‌రెడ్డి, ఎం.జైపాల్‌రెడ్డి, వరంగల్‌కు చెందిన దొమ్మాటి సాంబయ్యలు రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ కలసి రావాలి… ఉత్తమ్‌: తెరాసను తరిమికొట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కాంగ్రెస్‌ పార్టీతో కలసి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో జరుగుతోందన్నారు. రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెరాస పాలనలో అందరూ దగాపడ్డారని దుయ్యబట్టారు. 2019 ఎన్నికలు లక్ష్యంగా ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని కోరారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు.