2029కి రాష్ట్రంలో 50% పచ్చదనం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం 23శాతం ఉందని, 2029 నాటికి పచ్చదనాన్ని 50శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేవలం అటవీ ప్రాంతాల్లోనే కాకుండా మైదాన ప్రాంతాల్లోనూ మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆదివారం విశాఖపట్నంలో పర్యావరణ ప్రాంతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయని, వాటిలో 50శాతం భూముల్లో ఉద్యానపంటలు పెంచేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఆయా ఉద్యాన పంటల కారణంగా రైతులకు మంచి ఫలసాయం, ఆదాయంతోపాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పర్యావరణానికి శాపంలా మారిన ఘనవ్యర్థాలను రీసైకిల్‌ చేయడానికి వీలుగా చెత్త నుంచి సంపద సృష్టించే ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా 10చోట్ల ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పోగుపడే ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో కంపోస్ట్‌ ఎరువుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పర్యావరణానికి ఎంతో అనుకూలమైన ఎల్‌ఈడీ బల్బులను ప్రోత్సహించడానికి వీలుగా వాటిని ప్రతి ఇంటికీ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ బల్బుల వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పర్యావరణ అనుకూల విధానాల్లో పంటల పెంపకానికి వీలుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ను సలహాదారుగా నియమించామని… రానున్న రోజుల్లో ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను 100శాతం బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్రాంతాలుగా మార్చామని, దీంతోపాటు 4వేల గ్రామాలను ఇలా తీర్చిదిద్దామని వచ్చే సంవత్సరం అక్టోబరు 2వ తేదీకల్లా ఏపీలోని అన్ని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మారుస్తామని ప్రకటించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50శాతం నుంచి 60శాతం సంప్రదాయేతర ఇంధన వనరుల్నే ఉపయోగించనున్నామని ప్రకటించారు. జలాల్ని స్వచ్ఛంగా ఉంచడానికి, వాటి పవిత్రతను కాపాడడానికి వీలుగా గోదావరి నదికి ‘అఖండ గోదావరి హారతి’, కృష్ణా నదికి ‘పవిత్ర హారతి’ కార్యక్రమాల్ని నిర్వహించడమే కాకుండా ఇటీవలే ‘జలసిరి హారతి’ పేరిట జలాల్ని గౌరవిస్తూ వాటి స్వచ్ఛతకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాలు చేపట్టిన తరువాత వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిపిస్తున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. 2050 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా అభివృద్ధి చెందేలా స్పష్టమైన ప్రణాళకలు అమలు చేస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.కె.అగర్వాల్‌ మాట్లాడుతూ… 2010లో జాతీయ హరిత ట్రైబున్యల్‌ (ఎన్‌.జి.టి.) ఏర్పడిన నాటి నుంచి పర్యావరణ పరిరక్షణలో కీలక అడుగు పడినట్లైందన్నారు. చిప్కో, నర్మదా బచావో ఆందోళనలతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగిందని తెలిపారు. పలు పర్యావరణ కోర్సుల్ని ప్రవేశపెట్టినప్పటికీ వాటి ఫలితాలు క్షేత్రస్థాయికి ఇంకా చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రణాళికలు రచించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశం కర్బన రహిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్‌.జి.టి. అధ్యక్షుడు జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను నీళ్లలో వదిలేస్తుండటం, ఇతర వ్యర్థాలతోపాటు తగులబెడుతుండటంతో వాతావరణంలోకి విష వాయువులు చేరి ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను డంపింగ్‌యార్డుల్లో తగులబెట్టేస్తుంటారని… ఆ పొగనుంచి కేన్సర్‌ కారక విష వాయువులు వెలువడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హుద్‌హుద్‌లో నాశనమైన విశాఖలో వారం రోజుల్లోనే సాధారణ పరిస్థితి ఏర్పడేలా చేయడమే కాకుండా దేశంలోనే మూడో పరిశుభ్ర నగరంగా తయారుచేసి రికార్డు సృష్టించారని ప్రశంసించారు. ప్రస్తుతం విశాఖపట్నం దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో ఒకటో స్థానంలో ఉందనేది తన అభిప్రాయమని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు, ఎన్‌.జి.టి. దక్షిణ జోన్‌ సభ్యుడు జస్టిస్‌ నంబియార్‌ తదితరులు పాల్గొన్నారు.