ఎన్నారై భర్తల వేధింపులకు కేంద్రం చెక్‌..!

పెళ్లి చేసుకొని పరాయి దేశానికి తీసుకెళ్లి భార్యలను వేధించే ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్‌పెట్టనుంది. భార్యలను వేధించే ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు రద్దు చేయాలంటూ అత్యున్నతస్థాయి కమిటీ ఇచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తోంది.ఇటీవల కాలంలో ఎన్నారై భర్తలు వేధిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వచ్చాయి. దీంతో ఇటువంటి మహిళల రక్షణకు సాధ్యమైనన్ని చట్టపరమైన మార్గాలను సూచించేందుకు మేలో కేంద్రం ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై అధ్యయనం చేసిన కమిటీ పలు సూచనలు చేసింది.
కమిటీ సూచనలు ఇవే..
* భార్యలను వేధించే ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు సీజ్‌ లేదా రద్దు చేయాలి. పాస్‌పోర్టు రద్దు సమయంలో సదరు భర్త భారత్‌లో ఉంటే కేసు తేలేవరకూ విదేశాలకు వెళ్లడం సాధ్యంకాదు. ఒక వేళ విదేశాల్లో ఉంటే తక్షణమే భారత్‌ వచ్చేయాలి.
* ఎన్నారైల పెళ్లిలను కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేయించాలి.
* ఎన్నారై భర్త సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌, పని ప్రదేశం, ఇంటి చిరునామాలను పెళ్లి ధ్రువీకరణ పత్రాల్లో పొందుపర్చాలి.
* గృహహింసను విదేశాలతో చేసుకునే ఒప్పందాల పరిధిలోకి తీసుకొనిరావాలి.
* బాధిత మహిళలకు ఆయా దేశాల్లో భారతీయ దౌత్యకార్యాలయాలు అందించే సాయాన్ని 3,000 డాలర్ల నుంచి 6,000 డాలర్లకు పెంచాలి.
* జాతీయ స్థాయిలో విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వశాఖ, జాతీయ మహిళా కమిషన్‌ భాగస్వామ్యంతో ఒక జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
ఈ సూచనలకు కేంద్రం ఆమోదముద్ర వేయవచ్చని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ఎన్నారై మహిళల రక్షణకు విదేశీవ్యవహారాల శాఖతో కలిసి మహిళా శిశుసంక్షేమ శాఖతో కలిసి పనిచేసింది.
కేంద్రం ఏర్పాటు చేసిన అత్యుత్తమ స్థాయి ప్యానల్‌కు న్యాయమూర్తి అరవిందకుమార్‌ గోయల్‌ అధ్యక్షత వహించారు. ఆయన పంజాబ్‌ రాష్ట్ర ఎన్నారై కమిషన్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.