నవదీప్‌ దాటవేత!

పక్కా ప్రణాళికతో విచారణకు
డ్రగ్స్‌ అలవాటు లేదని సమాధానం
సిట్‌ ఆధారాలు చూపినపుడు మౌనం
రక్త నమూనా ఇచ్చేందుకు నిరాకరణ
బీపీఎం పబ్‌ భాగస్వామిగా అంగీకారం
టాలీవుడ్‌ హీరో నవదీప్‌ తనకు డ్రగ్స్‌ అలవాటు లేదన్నారు. తనను విచారించిన ఎక్సైజ్‌ సిట్‌ ముందు పదేపదే అదే సమాధానం చెప్పారు. అయితే, అధికారులు పలు ఆధారాలు చూపించి ప్రశ్నించగా దానిపై మౌనం వహించారు. దీంతో ఆయనకు డ్రగ్స్‌ అలవాటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా సోమవారం హీరో నవదీ్‌పను ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 9.30 గంటల వరకు 11 గంటల పాటు కొనసాగింది. వాస్తవానికి ఎక్సైజ్‌ అధికారుల వద్ద నవదీ్‌పకు సంబంధించిన సమాచారం చాలా ఉంది. గచ్చిబౌలిలోని బీపీఎం పబ్‌ ఆయనదే. పబ్‌లో డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారని, మత్తు డ్రింక్‌ను సరఫరా చేస్తున్నారని సమాచారం ఉంది. సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖుల ఇళ్లలో జరిగే ఈవెంట్లను నవదీప్‌ నిర్వహిస్తుంటారు. ఆ సందర్భాల్లో డ్రగ్స్‌ను అందిస్తున్నారన్న సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఇవే కోణాల్లో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా ప్రశ్నలకు ఆయన ‘నో’ అంటూ సమాధానాలిచ్చారు. డ్రగ్స్‌ అలవాటు ఉందా? ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరెవరికి సరఫరా చేస్తారు? అని ప్రశ్నించగా, తనకు అలవాటు లేదని చెప్పారు.

తమది చాలా సంప్రదాయ కుటుంబమని, డ్రగ్స్‌ పేర అనవసర నిందలు వేయొద్దని కోరారు. అధికారులు తమ వద్ద ఉన్న కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు, ఫోన్‌ కాల్స్‌, వాట్సప్‌ మెసేజ్‌లను చూపించారు. డ్రగ్స్‌ అలవాటు ఉందా? అంటూ మరోసారి ప్రశ్నించగా, ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చారు. గచ్చిబౌలిలోని బీపీఎం పబ్‌ మీదేనా అని అడగ్గా… అందులో తాను భాగస్వామినేనని చెప్పారు. అయితే… పబ్‌లో మత్తు డ్రింక్‌ను సరఫరా చేస్తున్నారా? అని ప్రశ్నించగా… అలాంటిదేమీ లేదన్నారు. మరీ కస్టమర్లకు వాట్సప్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారట కదా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదన్నారు. అధికారులు తమ వద్ద ఉన్న వాట్సప్‌ మెసేజ్‌లను చూపించగా చివరకు ఆయన అంగీకరించారు. కొన్ని సందర్భాల్లో కోడ్‌ భాషలో మెసేజ్‌లు వెళుతున్నది వాస్తవమేనని చెప్పినట్లు సమాచారం. అయితే, పబ్‌ ప్రమోషన్‌లో భాగంగా మెసేజ్‌లు పెడుతుంటామని, డ్రగ్స్‌ విషయంలో కాదని చెప్పారు. డ్రగ్స్‌ విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో సంబంధం ఉందా? అని ప్రశ్నిస్తే… అలాంటి సంబంధాలు లేవని తెలిపారు. డ్రగ్స్‌ కేసు నిందితుడు జీషాన్‌ అలీ పరిచయమేనన్నారు. ఇదివరకు తమ పబ్‌లో ఒకటి రెండు సార్లు జీషాన్‌ అలీ ఈవెంట్లు నిర్వహించాడని అంగీకరించారు.

మరో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఎవరో అసలే తెలియదని చెప్పారు. వాట్సప్‌ మెసేజ్‌లలో ‘క్రాక్‌’ అంటే ఏమిటని అధికారులు ప్రశ్నించారు. అలాంటి మెసేజ్‌లు తనకు తెలియవని నవదీప్‌ బదులిచ్చారు. గోవాకు వెళుతుంటావా? అని అడిగితే అవుననే సమాధానమిచ్చారు. నవదీప్‌ నుంచి రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలను సేకరించాలన్న ఉద్దేశంతో అధికారులు ఉస్మానియా ఆస్పత్రి నుంచి వైద్యులను పిలిపించారు. నమూనాలు ఇస్తావా? అంటూ నవదీ్‌పను అధికారులు ప్రశ్నించగా అందుకు ఆయన తిరస్కరించారు.

వాట్సప్‌ గ్రూపులు డ్రగ్స్‌ సరఫరా చేసేవారు తమ రెగ్యులర్‌ కస్టమర్ల జాబితాతో వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసినట్లు సిట్‌ విచారణలో తేలింది. గోవా, మనాలీ, వైజాగ్‌… ఇలా ప్రతి నెలా ఒక్కో పర్యాటక ప్రాంతంలో డ్రగ్స్‌ బ్యాచ్‌ పార్టీలు చేసుకునేవని తేలింది. ఒక్కో బ్యాచ్‌లో సుమారు 30 మంది వరకు సభ్యులుగా ఉన్నారు. అందులో విద్యార్ధులతో పాటు సాఫ్ట్‌వేర్‌, డీజే నిర్వాహకులు, మ్యుజీషియన్లు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. విద్యార్ధులకు కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్న అధికారులు, సినీ ప్రముఖులతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు.