పోలవరాన్ని పూర్తిచేస్తాం.. సీబీఐని అనుమతించింది అందుకే: గవర్నర్ నరసింహన్

పోలవరాన్ని పూర్తిచేస్తాం.. సీబీఐని అనుమతించింది అందుకే: గవర్నర్ నరసింహన్

విభజన హామీలను అమలు చేస్తామని, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. పూర్తి పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. కొత్త విధానాలను ప్రవేశపెడతామని, సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన అందించే ఉద్దేశంతోనే సీబీఐకి తిరిగి అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. నవరత్నాలను అమలు చేస్తామన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పిస్తామని, వచ్చే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు.

వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.12,500 అందిస్తామని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, అమ్మ ఒడి పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థికసాయం అందజేయనున్నట్టు చెప్పారు. రైతులకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తామని, అవసరమైన చోట ఉచితంగా బోర్లు వేయిస్తామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.