మహారాష్ట్రలో వర్షాలు... తెలంగాణ, ఏపీకి కొత్త సమస్య!

మహారాష్ట్రలో వర్షాలు… తెలంగాణ, ఏపీకి కొత్త సమస్య!

‘వాయు’ ప్రభావంతో భారీ వర్షాలు
గోదావరికి వరద నీరు వచ్చే అవకాశం
కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల వద్ద అధికారుల అప్రమత్తం
భారీ యంత్రాలను తొలగించాలని నిర్ణయం
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త సమస్య ఏర్పడింది. నైరుతి రుతుపవనాలకు తోడు, వాయు తుపాను తోడు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో, గోదావరి నదికి వరద ముప్పు పొంచివుంది. దీంతో పోలవరం ప్రాజెక్టులో ఇప్పటిదాకా చేసిన పనులను, ముఖ్యంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ లు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పునాదులను యుద్ధ ప్రాతిపదికన రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కాళేశ్వరం సహా పలు తెలంగాణ ప్రాజెక్టుల వద్ద నది మధ్యలో ఉన్న యంత్ర సామగ్రిని హుటాహుటిన తరలించాల్సివుంది.

ప్రాజెక్టు పనులకు ఏ విధమైన నష్టం కలుగకుండా నదీ ప్రవాహాన్ని సహజ సిద్ధంగా వెళ్లేలా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉప్పొంగే గోదావరి ఎలా వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులను వరద ముప్పు నుంచి కాపాడేందుకు ఇండో – కెనడియన్ సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. వరద పెరిగితే పోలవరం వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, రక్షిత చర్యలు చేపట్టేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు కాళేశ్వరంలో సైతం పనులను తాత్కాలికంగా ఆపేసి, యంత్ర సామగ్రిని తరలించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
Tags: maharastra, vaai, godavari river, telngana and AP

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.