ప్రధానమంత్రి రేసులో ప్రణబ్..

కాంగ్రెస్ గూట్లో ఉన్న యూపీయే మిత్రపక్షాలన్నీ ఖచ్చితంగా ఆమోదించే వ్యక్తికోసం అన్వేషణ జరుగుతోంది. మోడీని మళ్ళీ ప్రధానమంత్రి కాకుండా ఎలాగైనా ఆపడానికి ఈ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి, అనుభవశాలి, వివాదరహితుడు ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మోడీని కాదంటే మిత్రపక్షాలన్నీ దాదాకు సపోర్ట్ చేయడం లాంఛనమే. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేశారుర. ఎన్నో సమస్యలను అలవోకగా పరిష్కరించారు. ఆయనకు అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. ఆయనకు పెద్దమనిషి తరహా ట్రీట్‌మెంట్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కూడా ఆయనకు గౌరవం ఇస్తారు. ఆర్ఎస్ఎస్ కూడా ఆయనంటే అభిమానం చూపిస్తుంది. కాంగ్రెస్ సానుభూతిపరుడిగా ఉన్న ప్రణబ్ గతంలో ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లినప్పుడు అందరూ నోరెళ్ళబెట్టారు. కానీ వాటిని కాదని తనదైన ధోరణితో, తన భావాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశంలో కుండబద్ధలు కొట్టారు. దీంతో ఆర్ఎస్ఎస్ అభిమానం కూడా చూరగొన్నారు. మోడీకి వ్యతిరేకంగా గొంతు విప్పేవారు మోడీ స్థానంలో ఇంకెవరినైనా అంగీకరించే అవకాశం ఉంది. అందునా మోడీ కూడా ప్రణబ్ అంటే గౌరవం కలిగి ఉంటారు.

ఈమధ్యే దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇచ్చి సత్కరించారు. బీజేపీకి మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్ పుంజుకుంటే ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి కుర్చీపై కూర్చునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానిగా కూర్చబెట్టడానికి దీదీ కూడా వ్యతిరేకత చూపరు. ఇటు ఉత్తరాదిలోని వివిధ పార్టీల నాయకులు ప్రణబ్ అభ్యర్ధిత్వాన్ని ముక్తకంఠంతో అంగీకరిస్తారు. మోడీని కాదని, రాహుల్ ని ప్రధానిగా అంగీకరించే పరిస్థితి చాలా పార్టీల్లో లేదు. ఈ నేపథ్యంలో మోడీ స్థానంలో ప్రణబ్ ముఖర్జీ వస్తే తప్పేంటని అంటున్నారు. అయితే, ప్రణబ్ ప్రధాని కావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ప్రధానమంత్రిగా చేయవచ్చా? మన రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే లేవనే చెప్పవచ్చు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రాజాజీ గవర్నర్ జనరల్‌గా ఉన్నారు. ఆయన ఆ పదవి తర్వాత ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ జనరల్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే లేనిది, రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి కావడంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవంటున్నారు. దీంతో దాదాకు లైన్ క్లియర్ అయినట్టే. ఇదంతా ఒక ఎత్తయితే గత రెండుమూడునెలలుగా ప్రణబ్ ముఖర్జీని వివిధ పార్టీల నేతలు కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తనను కలిసిన వివిధ పార్టీల నేతలను కోరడం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం. ఇటు దక్షిణాది రాష్ట్రాల కీలక నేతలు కూడా ప్రణబ్ అంటే మోకరిల్లుతారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగే కేసీఆర్, జగన్ కూడా దాదాను తెరమీదకు తెస్తే తమ ఉమ్మడి ఎజెండా ఫెడరల్ ఫ్రంట్ గాలిపటాన్ని గాల్లోకి వదిలేయడం ఖాయం. ప్రణబ్ ప్రధాని అయితే ఈ రెండుపార్టీలు ప్రభుత్వంలో చేరతాయి. తన చిరకాల వాంఛ తెలంగాణ ఇచ్చిన ప్రణబ్ ముఖర్జీ అంటే కేసీఆర్‌కు వల్లమాలిన అభిమానం. ఆయనకు మోకరిల్లిన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తాయి.

కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వడం ఖాయం. కాంగ్రెస్ గానీ, చంద్రబాబునాయుడు గానీ కోరుకునేది మోడీని కాదు, మోడీయేతర ప్రభుత్వాన్ని. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నేతలు స్టాలిన్ తో సహా మోడీని కాదని ప్రణబ్ ముఖర్జీకి పట్టం కట్టేందుకు ఎలాంటి విముఖత చూపించే అవకాశం లేదు. మొత్తం మీద రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారడం ఖాయం. మోడీ ఎక్కువగా వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్, దేశానికి సంబంధించిన కీలక పదవిని అందించే సువర్ణావకాశాన్ని పొందవచ్చు. వివాదరహితుడైన ఈ మాజీ రాష్ట్రపతి కీలకమయిన ప్రధాని పదవిలో కూర్చున్నా ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు.

Source:News Sting

Leave a Reply