ప్రధానమంత్రి రేసులో ప్రణబ్

2019 లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పబోయేది ఎవరు? మోడీకి ఎదురుగాలి వీస్తే అందరికీ ఆమోదయోగ్యమయిన వ్యక్తి ఎవరు? తదుపరి ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న నేత ఎవరు? బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రధానమంత్రి నిజంగా రాబోతున్నారా? అంటే ఢిల్లీ పరిణామాలను బట్టి అవుననే సమాధానం వస్తోంది. దేశరాజకీయాలువేగంగా మారుతున్నాయి. మోడీ కరిష్మా తగ్గిపోతోంది. దేశాన్ని నడిపించే సమర్థ నాయకత్వం కావాలి. ఈసారి ఎన్నికలలో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవచ్చు. దీనికి బీజేపీ మినహాయింపు కాదు.

గతంలో వచ్చిన సీట్ల కంటే వంద సీట్ల వరకూ మోడీకి తగ్గవచ్చని అంటున్నారు. అదే జరిగితే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది. ఢిల్లీతో పాటు హిందీ బెల్ట్‌లో బీజేపీ కమలం వాడిపోతోంది. ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీకి ఎదురుగాలి బాగా వీస్తోందని సర్వేలు, రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ బలం బాగా తగ్గనుంది. ఈ నష్టాన్ని పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవాలని మోడీ అండ్ కో భావిస్తోంది. అయితే వారు ఆశించినట్టుగా బెంగాల్ బీజేపీకి అంత సానుకూలంగా లేదు. బెంగాల్లో పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ అంత త్వరగా బీజేపీకి అవకాశం ఇవ్వదు. అయితే బీజేపీ నేతలు మాత్రం బెంగాల్లో 20 సీట్లు సాధిస్తామంటున్నారు. ఇటు ఒడిశాలోనూ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 10 నుంచి 12 సీట్లు రాబట్టుకోగలిగితే వర్కవుట్ అవుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. అయితే మోడీ మాత్రం అంత త్వరగా బీజేపీ అధికారానికి దూరం అవుతుందంటే ఒప్పుకోవడం లేదు. దేశంలో ఏ ప్రాంతంలోనూ బీజేపీకి దీటుగా ఏ ఒక్క పార్టీ నిలబడలేకపోయిందంటున్నారు. గతంలో సాధించిన వాటికంటే ఈసారి ఎక్కువ సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో చివరిదశలో ఆయన అదే ధీమాతో ముందుకెళుతున్నారు.

బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతున్నదని ప్రజలు అనుకుంటున్నార. ఎన్డీఏలోని ఇతర పార్టీలు కూడా మంచి స్కోర్​ సాధిస్తాయంటున్నారు. ఇప్పుడున్న వాటికంటే ఎక్కువ సీట్లతో, ఫుల్​ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఈసారి దేశం నలుమూలల నుంచి మేం సీట్లు గెలవబోతున్నాం అని మోడీ చెబుతున్నా.. మనసులో ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 17వ లోక్‌స‌భ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌లు దాదాపు చివ‌రి అంకానికి చేరుకోవడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా బీజేపీని శాసించే ఆర్‌.ఎస్‌.ఎస్ చేసిన స‌ర్వేలో బీజేపీకి 180 సీట్లకు మించి రావని తేలింది. ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కులు చాలా రాష్ట్రాల్లో ఇంటింటి స‌ర్వే చేప‌ట్టి తేల్చిన లెక్క ఇది. జాతీయ మీడియాలో ఈ సర్వే హల్ చల్ చేస్తోంది. దీని ప్రకారం బీజేపీకి కేవ‌లం 180 సీట్లు మాత్రమే వ‌స్తాయని, మ‌రో 100 సీట్ల వ‌ర‌కు మిత్రుల స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంద‌ని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చేసిన ఈ ముందస్తు హెచ్చరిక‌లు ఇప్పుడు బీజేపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2014లో క‌నిపించినంత మోడీ హవా ఇప్పుడేమీ లేదన్నది నిజం గ‌త ఎన్నిక‌ల్లో ఒంటరిగా బీజేపీ అధికారం సాధించింది. ఎన్నో అంచ‌నాల‌తో ప్రధాని ప‌గ్గాలు చేప‌ట్టిన మోడీ.. ఈ ఐదేళ్లలో సాధించిన ఘ‌న‌త‌లు పెద్దగా లేవ‌ని చెప్పాలి. ఎన్నో వివాదాల ముసుర్లు మోడీని చుట్టిముట్టేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడానికి పార్టీలు సుముఖంగా ఉన్నా వారిని ప్రధానమంత్రి ఎవరనేది డోలాయమానంలో పడేస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు అంతగా ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా మాయావతి, ములాయం సింగ్, మమతా బెనర్జీ మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యున్నతమయిన ప్రధానమంత్రి పదవి వస్తుందంటే ఏ చిన్న అవకాశాన్ని మమత-మాయావతి వదులుకునేలా లేరు. ఈ నేపథ్యంలో వీరందరికీ ఆమోదయోగ్యమయిన వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. (ఇంకా ఉంది)
నరేంద్ర మోడీ కాకుంటే ఇంకెవరు? -2 ఇది కూడా చదవండి

Source: News Sting

Leave a Reply