ఎన్నికల నిర్వహణ ఖర్చులో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన నిజామాబాద్!

ఏపీ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్‌

ఒకవైపు పోలింగ్‌ జరుగుతుండగా.. మరోవైపు టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతుండగా.. తాజాగా విశాఖపట్నంలో మరో టీడీపీ నాయకుడు డబ్బుతో పట్టుబడ్డాడు. మర్రిపాలెం జ్యోతినగర్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు కొప్పిరెడ్డి రామకృష్ణ రూ. 2 లక్షలతో దొరికిపోయాడు. అతను ఈ డబ్బును ఓటర్లకు పంచేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది.

అనిల్‌కుమార్‌ యాదవ్‌పై దాడి
నెల్లూరు :
 నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్‌ స్కూల్‌ వద్ద పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. దీనిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలు ఆయనపై దాడి చేశారు.

 గోపిరెడ్డిని కారుతో ఢీకొట్టిన ‘పచ్చ’ నేత
గుంటూరు: 
యలమందలో టీడీపీ నేతలు గూండాయిజానికి దిగారు. నర్సరావుపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకుడు కడియల రమేశ్‌ దాడికి దిగాడు. అంతేకాకుండా గోపిరెడ్డిని కారుతో అతను ఢీకొట్టాడు. దీంతో గోపిరెడ్డి గాయపడ్డారు. బరితెగించి మరీ టీడీపీ నేతలు పోలింగ్‌ రోజున రెచ్చిపోతుండటంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనిగోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లను సైతం కిడ్నాప్‌ చేశారని, ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

  • అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు బరితెగించారు. ఇక్కడి వీరాపురంలో జేసీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ నాయకులు రిగ్గింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు వేట కోడవళ్లతో దాడులకు దిగారు. జేసీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు.
    చదవండి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణహత్య

దుష్ప్రచారాన్ని నమ్మకండి: ద్వివేది

  • రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని, సమస్యలు లేవని తాజాగా విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని కొన్ని టీవీ చానెళ్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన వెల్లడించారు. ఒకరికి ఓటు వేస్తే వేరొకరికి వెళ్తుందన్నది కూడా దుష్ప్రచారమేనని, ఈవీఎంలపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని ఆయన ఓటర్లకు సూచించారు.
    చదవండి: మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు : ద్వివేది

పచ్చపార్టీ నేతల దౌర్జన్యం

  • పచ్చపార్టీ నేతలు పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల దాడులకు తెగబడుతున్నారు. పోలింగ్‌కు అంతరాయం కలిగించేలా కొన్ని ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్సావవంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ప్రజలు బారులు తీరారు. కొన్నిచోట్ల మొదట ఈవీఎంలు మొరాయించినా.. ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం కావడంతో దాదాపు రాష్ట్రమంతటా పోలింగ్‌ సజావుగా సాగుతోంది.
    చదవండి: రెచ్చిపోతున్న పచ్చపార్టీ నేతలు

సీఈవోను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు
అమరావతి : రాష్ట్రంలో పోలింగ్‌ నేపథ్యంలో ఈవీఎంలపై పచ్చ మీడియాలో దుష్ప్రచారాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం ఈసీని కలిశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పోలింగ్‌, పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన పరిస్థితులు సీఈవోకు వివరించిన వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్‌ నాగిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటలకే రీ పోలింగ్‌ అంటున్నారని విమర్శించారు. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ, నాగిరెడ్డి మండిపడ్డారు. పచ్చ చొక్కాలతో పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారని, ఇలా చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని వారు అన్నారు.

టీడీపీ ప్రలోభాలు..
ప్రకాశం: 
పోలింగ్‌ రోజున కూడా టీడీపీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని కొత్తపేటలో ఏకంగా పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేత ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాడు. దీంతో పోలింగ్‌ కేంద్ర వద్దే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత చుండూరు వాసును పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతా: డీఎల్‌
వైఎస్సార్‌ జిల్లా: 
తనపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు డీఎల్‌ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తనపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఇందుకుగాను పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు కథనాలు రాసిన పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతానని డీఎల్‌ హెచ్చరించారు.

స్వేచ్ఛగా ఓటు వేయండి..
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎన్నికలకు సంబంధించిన దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, పలుచోట్ల ఈవీఎంలలో తలెత్తిన లోపాలు సరిదిద్దామని తెలిపింది.
చదవండి: ఈవీఎంలో లోపాలు.. ఈసీ కీలక ప్రకటన

ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌ శాతాలివే!

ఏపీ అంతటా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు.. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతున్నా.. చాలావరకు పోలింగ్‌ పెద్ద ఎత్తున సాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన ఓటింగ్‌ శాతం వివరాలు ఇలా ఉన్నాయి..

  • అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 12.95శాతం పోలింగ్‌ నమోదు
  • నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 14శాతం పోలింగ్‌ నమోదు
  • తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 12.36శాతం పోలింగ్‌ నమోదు
  • విజయనగరం: కురపాం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 15శాతం నమోదు

దాడులు.. దౌర్జన్యాలు.. రాప్తాడులో ఉద్రిక్తత!

  • అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి దిగుతుండటంతో ఇక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు సనపలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో పరిటాల అనుచరులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. సిద్ధరాంపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు రాళ్ల దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మరూరు గ్రామంలో పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఏకంగా ఓటర్లను బెదిరించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

టీజీ వెంకటేశ్‌ హల్‌చల్‌
కర్నూలు: 
పోలింగ్‌ కేంద్రాల బూత్‌ల వద్ద టీడీపీ నేత, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా.. ఓటర్లు టీడీపీకి ఓటు వేసేలా ఆయన పోలింగ్‌ కేంద్రాల వద్ద వ్యవహరిస్తుండటంపై ఆయన తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్‌ జిల్లా : జమ్మలమడుగు మండలం పొన్నతోట పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఏకంగా పోలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

  • ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.  వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్‌ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఓటర్లతో కలిసి ధర్నాకు దిగారు.
  • శ్రీకాకుళం : సంతబొమ్మాలి మండలం నిమ్మడలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల సిబ్బందిపై అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరింపులకు దిగారు. నిమ్మడ పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌ కెమెరాలను తొలగించి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. ఇంత జరుగుతున్నా పోలింగ్‌ కేంద్రం వద్దకు పోలీసులు రాకపోవడం గమనార్హం.

వైఎస్‌ జగన్‌ వల్ల ‘హోదా’ సజీవంగా ఉంది!

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్‌ జగన్‌ అవగాహన పెంచారని వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల తెలిపారు. యువత పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుందని అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పులివెందులలో వైఎస్‌ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత

  • వైఎస్సార్‌ జిల్లా: పొట్లదుర్తిలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దౌర్జన్యానికి దిగారు. పొట్లదుర్తిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌  పార్టీ ఏజెంట్‌పై సీఎం రమేశ్‌ చేయి చేసుకున్నారు.
  • చిత్తూరు: ఐరాలం మండల నాంపల్లి, పేరయ్యగారిపల్లి, కమ్మకిందపల్లిలో ఓటు వేసేందుకు వెళుతున్న దళితులను అడ్డుకున్న టీడీపీ..
  • విశాఖ: పాయకరావుపేట మండలం పింటకోట పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ గుర్తు పడకపోవడంతో పోలింగ్‌ నిలిపివేత
  • గుంటూరు: నర్సరావుపేట రామచంద్రాపురం పోలింగ్‌ బూత్‌ను స్వాధీనం చేసుకున్న టీడీపీ నేతలు

టీడీపీ దౌర్జన్యం.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల కిడ్నాప్‌!

  • గుంటూరు: నర్సరావుపేట మండలం యలమందలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకొని.. వారిని టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో ఒక ఏజెంట్‌ గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ నర్సరావుపేట అభ్యర్థి  గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపైనా పచ్చ పార్టీ నేతలు దాడికి దిగారు. దీంతో ఆయన సెల్‌ఫోన్‌తోపాటు మీడియా ప్రతినిధి కెమెరా ధ్వంసమయ్యాయి.

  • మంగళగిరి : ఉండవల్లిలో సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేశ్‌ దంపతులు ఓటు వేశారు.

మొరాయిస్తున్న ఈవీఎంలు..

  • రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే, సాంకేతిక సమస్యలతో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. మరికొన్ని చోట్ల పోలింగ్‌ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 7.40 గంటల కల్లా అందుతున్న సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్‌లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం  లేదు.

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ జగన్‌..

  • పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని  ఆశిస్తున్నట్టు తెలిపారు. జనం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నట్టు చెప్పారు. నిర్భయంగా ఓటు వేయాలని కొత్త ఓటర్లకు వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైఎస్‌ జగన్‌ పులివెందులలోని భాకరాపురం ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు.  ముందుగా లోక్‌సభ అభ్యర్థికి, ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఆయన ఓటు వేశారు.  ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి బయల్దేరే ముందు వైఎస్‌ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

  • రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి గోపాల క్రిష్ణ  ద్వివేది తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని మున్సిపల్ హై స్కూల్ లో పోలింగ్‌ తీరును ఆయన పరిశీలించారు. మొరాయించిన ఈవీఎంలను టెక్నికల్‌ టీమ్‌ రిపేర్‌ చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, సాయంతం 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న అందరికీ ఓటు హక్కును కల్పిస్తామని చెప్పారు.

  • గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్‌ బూగ్‌ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం లో 214, 210 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. 210 బూత్‌లో ఇంకా మాక్‌ పోలింగ్‌ ప్రారంభం కాలేదు. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు.
  • పార్వతీపురం 38వ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్‌లో ఈవీఎం మొరాయించింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 122వ పోలింగ్ కేంద్రంలోఈవీఎం మొరాయించింది. గట్టిగా నొక్కినా ఓట్లు పడలేదు. అలాగే ఓటు వేశాక బీప్‌ సౌండ్‌ రాలేదు. ఏజెంట్లు రానిపక్షంలో వారి కోసం 15 నిముషాలు ఎదురుచూశారు.  నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,120 పోలింగ్‌ కేంద్రాలకు గాను 28,000 చోట్ల వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.
  • ఆంధ్ర్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7గంటలకు సాఫీగా ప్రారంభంమైంది. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఐదున్నర గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలీంగ్‌ నిర్వహించారు. అన్ని పార్టీల ఏజెంట్లు మాక్‌పోలింగ్‌కి అందుబాటులో ఉండేలా చూసి ఈ మాక్‌పోలింగ్‌ను జరిపారు.  రాష్ట్రంలో175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలకు గాను  46,120 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.

Tags: Andhra Pradesh Election 2019,EVM,Polling Agents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.