వేలానికి నీరవ్ మోదీ కార్లు.. టెస్ట్ డ్రైవ్ చేయడం కుదరదు!

సరైన కండిషన్ లో ఉన్న కార్లు
మంచి ధర పలుకుతాయని భావిస్తున్న ఈడీ
వారం ముందు కార్లు పరిశీలించుకునే అవకాశం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్లలో కుచ్చుటోపీ పెట్టి లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీకి సంబంధించిన కార్లను వేలం వేయాలని ఈడీ నిర్ణయించింది. నీరవ్ మోదీకి 13 విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ బెంజ్, పనామెరా, హోండా, టయోటా, ఇన్నోవా కంపెనీల కార్లున్నాయి. ఈ కార్లను ఏప్రిల్ 18న ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. వేలం నిర్వహించే బాధ్యతను ఈడీ అధికారులు మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్మెస్ టీసీ)కి అప్పగించారు.

ఈ వేలంలో పాల్గొనేవారు ముందుగా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. కార్లన్నీ సరైన కండిషన్ లో ఉండడంతో టెస్ట్ డ్రైవ్ కు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు. అయితే, వేలం ప్రక్రియకు వారం రోజుల ముందు కార్లను పరిశీలించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఐటీ శాఖ నీరవ్ మోదీకి సంబంధించిన పెయింటింగ్స్ వేలం వేయడం ద్వారా రూ.54.84 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈడీ తనవంతుగా కార్ల వేలం వేస్తోంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.