అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని తెలిసే వెళ్లాడు: జాన్ అలెన్ స్నేహితుడు రెమ్కో

సెంటినెలీస్ తెగ ఎంత ప్రమాదకరమైనదో తెలిసే జాన్ అలెన్ చౌ అక్కడికి వెళ్లాడని, వారి గురించి ముందే అధ్యయనం చేశాడని, దురదృష్టవశాత్తు వారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడని అతడి స్నేహితుడు రెమ్కో స్నోయెన్జీ తెలిపాడు. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ భాష నేర్చుకుని వారికి మిషనరీ గురించి చెప్పేందుకు వెళ్లిన అమెరికా మిషనరీకి చెందిన జాన్ వారి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, అక్కడికి వెళ్లడానికి ముందే ఆ తెగ గురించి అన్నీ తెలుసుకున్నాడు. వారెంత ప్రమాదకారులో అర్థం చేసుకున్నాడు. పుస్తకాలు చదివాడు. ఆ తెగ గురించి అధ్యయనం చేశాడు. అండమాన్ వెళ్లాక మూడు రోజులు తనతో టచ్‌లో ఉన్నాడని, ఆ తర్వాత అతడు చనిపోయినట్టు తనకు తెలిసిందని రెమ్కో స్నోయెన్జీ వివరించాడు.

సెంటినెలీస్ తెగతో ఎలా మసలుకోవాలో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడని, కొన్ని సంవత్సరాలపాటు అక్కడే ఉండి వారి భాష నేర్చుకోవాలని జాన్ భావించాడని రెమ్కో తెలిపాడు. ఇందుకోసం ముందుగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడని చెప్పాడు. అక్కడే స్కూబా డైవింగ్ కూడా నేర్చుకుంటానని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. అక్కడికి వెళ్లాక తనకేదైనా జరిగితే కుటుంబ సభ్యులు బాధపడకుండా ఉండేందుకు ముందే వారిని మానసికంగా సిద్ధం చేశాడని పేర్కొన్నాడు. అంతేకాదు, అక్కడికి వెళ్లి వారితో పోరాడడం చట్టబద్ధం కాదని కూడా అతడికి తెలుసని రెమ్కో వివరించాడు. ఈనెల 17న సెంటినెలీస్ తెగ చేతిలో హతమైన జాన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇటీవల పోలీసులు బోటులో వెళ్లేందుకు ప్రయత్నించగా జాన్‌ను హత్య చేసిన ప్రదేశంలో తెగవారు బాణాలతో సిద్ధంగా ఉండడంతో వెనక్కి వచ్చేశారు. అది రక్షిత తెగ కావడంతో వారికి హాని కలగకుండా మృతదేహాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు జాన్ మృతదేహాన్ని తీసుకురావాలన్న ఆలోచనను విరమించుకోవడమే మంచిదని మానవ పరిణామ శాస్త్రకారులు (ఆంత్రోపాలజిస్టులు) సలహా ఇస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.