‘శబరిమల’ తీర్పు ఉపసంహరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ

కేరళ రాష్ట్రం శబరిమలలోని అయ్యప్పస్వామి ఆయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూపిటిషన్‌పై విచారణ ఈరోజు ప్రారంభమైంది. తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ నాయర్‌ సర్వీస్‌ సొసైటీ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మహిళలపై ఆంక్షలు విధించడం అంటే లింగ వివక్షను ప్రోత్సహించడమే అని పేర్కొంటూ, నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు సెప్టెంబర్‌ 28వ తేదీన తీర్పు ఇచ్చింది. వందల ఏళ్లనాటి ఆలయ సంప్రదాయాన్ని పక్కన పెడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మొత్తం 64 పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు కాగా, అందులో నాయర్‌ సొసైటీ ఒకటి. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. గొగోయ్‌తోపాటు ధర్మాసనంలో ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, ఎ.ఎం.ఖన్వీల్కర్‌, డి.వై.చంద్రచూడ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరపు న్యాయవాది కె.ప్రసరణ్‌ తన వాదనలు వినిపించారు.