వరంగల్ లో టాస్క్ ఫోర్స్

వరంగల్ లో టాస్క్ ఫోర్స్

వరంగల్ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో గుడుంబా, గంజాయి, పేకాట శిబిరాలు, సట్టా, మట్కా, గుట్కా, తెల్ల కిరోసిన్‌ విక్రయం, నిషేధిత ప్లాస్టిక్‌ కవర్స్‌, ఇతరత్ర వస్తువులను స్థానిక పోలీసులను మచ్చిక చేసుకొని విక్రయించేవారు. వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగేది. మూడు రోజుల నుంచి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగగానే వీరందరూ వ్యాపారాలు బంద్‌ చేసి విహారయాత్రలకు వెళ్లారు. పూర్తిగా స్తబ్దత నెలకొంది. కొంతమంది అక్రమ వ్యాపారాన్ని భయంభయంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారాలపై దాడులు చేసి తమ సత్తాను చాటాలనే ప్రయత్నంలో టాస్క్‌ఫోర్స్‌ విభాగం ఉంది.

నగరంలో వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేసిన హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను టాస్క్‌ఫోర్స్‌ విభాగంలోకి తీసుకున్నారు. నగరంలో ఇతర ప్రాంతాలలో ఎవరు ఎక్కడ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. దానికి మూలలు ఎక్కడ ఉన్నాయి. వారికి ఎవరెవరితో సంబంధాలున్నాయి. అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పాత నేరస్థులు ఎక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? గతంలో వీరిపై ఏ కేసులు నమోదయ్యాయి. తదితర కోణాల్లో వివరాలు తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సేకరించిన వివరాలతో రానున్న రోజులలో అక్రమ వ్యాపారాలు చేసే వారిపై మెరుపుదాడులు చేసి అరెస్టు చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

కమిషనరేట్‌ పరిధిలో వివిధ నేరాలను గుర్తించి వెంటనే టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మెరుపుదాడులు నిర్వహిస్తోంది. ఎంతటి వారు ఉన్నా వారిని పట్టుకొని సంబంధిత పోలీసుస్టేషన్‌కు తీసుకొని వెళ్లి వదిలివేస్తుంది. ఆ తర్వాత స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ చేయాల్సి ఉంటుంది. దాడి చేయకముందే పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఇస్తారు. వారి నుంచి అనుమతి తీసుకొని వెంటనే దాడులు చేస్తారు. సాధారణ దుస్తులలో ఉండి వీరు మెరుపు దాడులు చేస్తారు. టాస్క్‌ఫోర్స్‌ విభాగం బలోపేతమైతే నేరాలు తగ్గుతాయి. వీరు కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడైనా దాడులు చేసే అవకాశం ఉంటుంది. తరువాత స్థానిక పోలీసులకు అప్పగిస్తారు.