వచ్చింది శబ్దవిప్లవమే

వచ్చింది శబ్దవిప్లవమే

పేదప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. కాంగ్రెస్ గూబ గుయ్య్ మనిపించే విధంగా శబ్దవిప్లవం రానుందని అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనేక సభల్లో చెప్పానని, అదే నిజమైందని అన్నారు. తెలంగాణ ప్రజలు గుంజి కొడితే వచ్చిన శబ్దవిప్లవానికి పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గూబ గుయ్య్‌మందని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నాయకులు ఇంకా కోలుకోలేదని, వారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి కూడా లేదని ఎద్దేవాచేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో హుజూర్‌నగర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అహంకారిగా అభివర్ణించిన కేటీఆర్.. హుజూర్‌నగర్ నియోజకవర్గ సమస్యలను గత ఐదేండ్లలో అక్కడి ఎమ్మెల్యేగా ఏనాడూ ప్రజాసమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఒక్కనాడు కూడా సమస్యల పరిష్కారం కోసం సీఎంనుగానీ, మంత్రులనుగానీ కలువలేదన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు.

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా మొదటిసారి ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారని, ఆ తర్వాత నాటినుంచి నేటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదని గుర్తుచేశారు. పోయినదగ్గరే వెతుక్కోవాలనే నానుడి ప్రకారం ప్రజలకు చేరువగా ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓడిపోయామని కుంగిపోకుండా, ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాంటి నేతలనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్ చరిత్ర తిరుగరాయాలని కోరారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఎక్కువమంది పోటీపడే అవకాశముందన్న కేటీఆర్.. అటువంటిచోట్ల పోటీ నివారణకు కృషిచేయాలని సూచించారు.

పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుందాం
తండాలు, గూడేలను పంచాయతీలుగా చేయాలన్న గిరిజనుల చిరకాల వాంఛ నెరవేరిందని కేటీఆర్ అన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలను ప్రభుత్వం ఇస్తుందన్న కేటీఆర్.. అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవమయ్యేలా చూడాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ పెరిగే విధంగా కృషిచేయాలని చెప్పారు. పోలింగ్ శాతం పెరిగితే టీఆర్‌ఎస్‌కు మెజార్టీ పెరుగుతుందని చెప్పారు. 2014 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ ఆరు స్థానాలు గెలిస్తే ఈసారి తొమ్మిది స్థానాల్లో గెలిచామని చెప్పారు.

మహామహులను మట్టికరిపించిన నల్లగొండ ప్రజలు
2018 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో ఓటమి ఎరుగమని చెప్పుకొన్న జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులను ప్రజలు మట్టికరిపించారని కేటీఆర్ చెప్పారు. గత నాలుగున్నరేండ్లలో ఏనాడూ జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు వారు హాజరుకాలేదని గుర్తుచేశారు. చావుతప్పి కన్నులొట్టపోయిన విధంగా ఉత్తమ్ గెలిచారని ఎద్దేవాచేశారు. ఉత్తమ్ ట్రక్కుగుర్తు, టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించి గెలిచారని విమర్శించారు. సీఎం అవుతానంటూ మాట్లాడి కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకున్నారన్నారు. చాలామంది కాం గ్రెస్ నాయకులకు ప్రజలే రిటైర్మెంట్ ప్రకటించారని చురకలువేశారు. సోనియాగాంధీ ఆరోగ్యం బాగలేక కొంతకాలంగా ఎక్కడా ప్రచారం చేయడం లేదని, అయినా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ప్రచారం చేయించారని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు కలలుకంటూ సీఎం అయిపోతామని ఊహల్లో విహరించారని, ఒకరు హోంమంత్రి, మరొకరు ఇరిగేషన్ మంత్రి అంటూ శాఖలుకూడా పంచుకున్నారని ఎద్దేవాచేశారు. ఫలితాల ముందురోజు గవర్నర్ దగ్గరకుపోయి అతిపెద్ద పార్టీగా కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా పిలువాలని కోరారని అపహాస్యంచేశారు. పొన్నాల లక్ష్మయ్య మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అడుగుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును తరిమికొడితే, కాంగ్రెస్ నేతలు ఆయనను మళ్లీ పట్టుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన రూ.500కోట్లతో కాంగ్రెస్ కుట్రలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అమరావతికి గులాములుగా మారినా, తెలంగాణ ప్రజలు మాత్రం తమ అస్థిత్వాన్ని చాటుకున్నారంటూ ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.