రివర్స్‌ టెండరింగ్‌కు మార్గదర్శకాలు విడుదల

రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌తోపాటు కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్‌ విధానంపై మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 22వ తేదీన నిర్వహించిన చీఫ్‌ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ జాబితాలో 29 అంశాలను నిర్ధేశించింది.

ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష తర్వాతే రివర్స్‌ టెండరింగ్‌ కార్యచరణ ప్రారంభంకానుంది. నిర్మాణంలో ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టు సంస్థను తప్పించిన అనంతరం మిగిలిన పనులను అసలు ఒప్పంద రేట్లతో జలవనరుల శాఖ ప్రాథమిక అంచనా విలువను నిర్దారించనుంది. ప్రాథమిక అంచనా విలువతో సదరు ప్రాజెక్టు మిగిలిన పనులపై ప్రభుత్వం ఈ- టెండరింగ్‌కు వెళ్లనుంది. అలాగే ఈ-టెండరింగ్‌లో పాల్గొనే సంస్థ ఏపీలో రిజిస్టర్‌ కావాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఒకవేళ బిడ్డర్‌ రాకపోతే మిగిలిన పనుల్ని చిన్న చిన్న ప్యాకేజీలుగా విడదీసి ఈ-టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది.

కాగా, పోలవరం పనులను సమూలంగా ప్రక్షాళన చేసి అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం నిపుణుల కమిటీ సిఫార్సులను పోలవరం ప్రాజెక్టుకు వివరించిన రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు అనుమతి తీసుకుంది.

Leave a Reply