మోదీని ఎందుకు తొలగించాలో ప్రతిపక్షాలు చెప్పాలి: బీజేపీ నేత పురంధేశ్వరి డిమాండ్

మోదీని ఎందుకు తొలగించాలో ప్రతిపక్షాలు చెప్పాలి: బీజేపీ నేత పురంధేశ్వరి డిమాండ్

ప్రధాని మోదీని తొలగించాలని వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆయన్ని ఎందుకు తొలగించాలో చెప్పాలని బీజేపీ నేత పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, నల్లకుబేరుల పని పడుతున్నందుకా మోదీని తొలగించాలి? రుణాలు ఎగ్గొడుతున్న వారి పని పడుతున్నందుకు మోదీని తొలగించాలా? అని ప్రశ్నించారు.

నోట్ల రద్దు కారణంగా దేశానికి ఎంతో ప్రయోజనం కలిగిందని, మూడున్నర లక్షల నకిలీ కంపెనీలు మూతపడ్డాయని, ఆదాయపన్ను కట్టే వారి సంఖ్య పెరిగిందని అన్నారు. కేంద్ర భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏమీ జరగదని, హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు ఒప్పుకున్నారని, సుజనా చౌదరిని పక్కన పెట్టుకునే అరుణ్ జైట్లీ ప్యాకేజ్ ప్రకటించారని అన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై సవరించిన డీపీఆర్ కి జలవనరుల శాఖ ఆమోదం తెలిపిందని, ఆర్థిక శాఖ నుంచి కూడా ఆమోదం వచ్చాక నిధులొస్తాయని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్రం ఇవ్వలేదని ఆరోపించారు. దుగరాజపట్నం పోర్టు విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తోందని పురంధేశ్వరి దుయ్యబట్టారు.