భారత్ కు అప్పగింతపై యూకే హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా

భారత్ కు అప్పగింతపై యూకే హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా

వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత వ్యవహారంలో బ్రిటన్ పారిపోయి లండన్ లో తలదాచుకుంటున్న బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా స్వదేశంలో విచారణ ఎదుర్కోవడానికి ఏమాత్రం ఇష్టపడడంలేదు. నేరస్తుల పరస్పర అప్పగింత ఒప్పందంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం తనను భారత్ కు అప్పగించాలని తీసుకున్న నిర్ణయాన్ని మాల్యా బ్రిటీష్ కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా తన న్యాయవాది ద్వారా యూకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ లో హోమ్ శాఖ సెక్రటరీ నిర్ణయాన్ని ప్రశ్నించిన మాల్యా… వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేశారు.

ఫిబ్రవరి మొదటి వారంలో ఈ కేసును విచారించిన వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం భారత్ లోని కోర్టులకు మాల్యా జవాబు చెప్పాల్సి ఉందని తన తీర్పులో విస్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, తన తీర్పు కాపీని యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ కు పంపించింది. సాధారణంగా ఓ నేరస్తుడిని మరో దేశానికి అప్పగించే అధికారం బ్రిటన్ లో హోమ్ సెక్రటరీ ఒక్కడికి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో సాజిద్ జావిద్ అన్ని విషయాలు పరిశీలించి మాల్యాను భారత్ కు అప్పగించాలంటూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఈ నిర్ణయంపైనే మాల్యా యూకే హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు మాల్యాను వివరణ కోరగా, ఈ వ్యవహారంలో అప్పీల్ చేస్తానని ముందే చెప్పానని, ఈ కేసులో తీర్పు ఎప్పుడొస్తుందన్నది మాత్రం చెప్పలేనని, అన్ని వ్యవహారాలు తన లాయర్ చూసుకుంటున్నాడని తెలిపారు.

విజయ్ మాల్యా 2009లో భారత్ లోని అనేక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ప్రస్తుతం రూ.10,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను దారిలో పెట్టడానికి ఆయన తీసుకున్న రుణాలు తీర్చలేనివిగా మారాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ఆ ఎయిర్ లైన్స్ నానాటికీ గుదిబండలా మారడమే కాదు ఆయనకు ఎంతో పట్టున్న లిక్కర్ వ్యాపారాలను సైతం ప్రభావితం చేసింది. తనకు భారీగా వాటాలున్న అనేక మద్యం వ్యాపారాలను కూడా మాల్యా విక్రయించాల్సి రావడమే కాదు చివరికి బ్యాంకు అప్పులు కూడా తీర్చలేని పరిస్థితుల్లో విదేశాలకు పరారయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.