బీజేపీలో ఉన్నవారంతా పిరికిపందలే: సిద్ధరామయ్య

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. రెబెల్ ఎమ్మెల్యేల ద్వారా అధికారంలోకి వద్దామని భావించిన బీజేపీకి ముఖ్యమంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ బలపరీక్షకు ఆయన సిద్ధమయ్యారు. దీంతో, డిఫెన్స్ లో పడిపోయిన బీజేపీ… తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని క్యాంపుకు తరలించింది. ఈ నేపథ్యంలో, బలపరీక్షకు సిద్ధపడి సాహసం చేస్తున్నట్టున్నారంటూ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మీడియా పశ్నించింది. దీనికి సమాధానంగా, బలపరీక్ష నెగ్గుతామనే నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు.

నమ్మకం ఉంది కాబట్టే బలపరీక్షకు సిద్ధమయ్యామని సిద్ధరామయ్య తెలిపారు. బీజేపీలో ఉన్నవారంతా పిరికిపందలేనని, అందుకే తమకు భయపడి వారి ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం వల్ల కూటమి మరింత బలపడిందని అన్నారు.
Tags: Siddaramaiah,Karnataka,Congress,BJP,Floor Test

Leave a Reply